ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’ | Eight infrastructure sectors of the Group 'minus' | Sakshi
Sakshi News home page

ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’

Published Fri, Jan 1 2016 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’

ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’

వార్షిక ప్రాతిపదికన నవంబర్ ఉత్పత్తిలో వృద్ధి శూన్యం...
1.3 శాతం క్షీణిత  (మైనస్) నమోదు
ఇదే నెల ఐఐపీ గణాంకాలపై
ప్రతికూల ప్రభావం చూపే అవకాశం!

 
 న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి  2015 నవంబర్‌లో పూర్తి నిరాశను మిగిల్చింది. 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్)ను నమోదుచేసుకుంది. గడచిన ఏడు నెలల కాలంలో ఇంత దారుణమైన ఫలితం ఎన్నడూ రాలేదు (ఏప్రిల్‌లో 0.4 శాతం క్షీణత).  మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా దాదాపు 38 శాతం.
 
  జనవరి రెండవ వారంలో వెలువడనున్న నవంబర్ ఐఐపీ  ఫలితంపై తాజా ఫలితం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2014 నవంబర్‌లో గ్రూప్ ఉత్పత్తి రేటు 8.5 శాతం. 2015 అక్టోబర్‌లో 3.2%. కాగా 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 6 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన నవంబర్ గణాంకాల ప్రకారం 8 రంగాల పనితీరునూ వార్షిక రీతిన వేర్వేరుగా చూస్తే...
 
 క్షీణతలో...

 క్రూడ్ ఆయిల్: ఉత్పత్తి  క్షీణత మరింత పెరిగింది.  -0.1%క్షీణత మరింతగా-3.3% క్షీణతకు జారింది.
 సహజ వాయువు: ఈ రంగంలో కూడా -2.3 శాతం క్షీణత మరింతగా - 3.9 శాతానికి దిగింది.
 సిమెంట్: వృద్ధిలేకపోగా -1.8 శాతం క్షీణత నమోదయ్యింది.
 స్టీల్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా 8.4 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది.
 
 వృద్ధి రేట్లు డౌన్...

 విద్యుత్: ఉత్పత్తి 9.9 శాతం నుంచి నిశ్చల స్థాయి (0 శాతం)కి చేరింది.
 బొగ్గు: వృద్ధి రేటు 14.6 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయింది.
 రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి 8.1 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది.
 
 ఒకే ఒక్కటి...
 ఎరువులు: ఈ రంగం మాత్రం మంచి పనితీరు కనబరిచింది.  2.8 శాతం క్షీణత (మైనస్) 13.5 శాతం వృద్ధికి చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement