ఎస్సార్ బిజినెస్ పార్క్ విక్రయం
రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌ఎంజీ కార్ప్
న్యూఢిల్లీ: ఎస్సార్ కంపెనీ ముంబైలోని బిజినెస్ పార్క్‌ను విక్రయించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో 1.25 మిలియన్‌ల చదరపుటడుగుల విస్తీర్ణమున్న ఈక్వినాక్స్ బిజి నెస్ పార్క్‌ను బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఆర్‌ఎంజీ కార్ప్‌కు విక్రయించామని ఎస్సార్ కంపెనీ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,400 కోట్లని ఎస్సార్ గ్రూప్‌కు చెందిన అన్షుమన్ రుయా పేర్కొన్నారు.
కీలకం కాని ఆస్తుల విక్రయ వ్యూహంలో భాగంగా ఈ బిజినెస్ పార్క్‌ను విక్రయించామని వివరించారు. ఈ బిజినెస్ పార్క్ విక్రయం ద్వారా వచ్చిన నిధులను తమ రూ.80,000 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. భారత్‌లో ఇటీవల కాలంలో జరిగిన రెండో అతి పెద్ద ఆఫీస్ మార్కెట్ డీల్ ఇది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే బీకేసీలో 4.35 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణమున్న కమర్షియల్ స్పేస్‌ను గోద్రేజ్ ప్రోపర్టీస్ రూ.1,480 కోట్లకు విక్రయించింది.