ఎవ్వరిదీ పైసా ఉంచుకోను...క్షమించండి! | Essel group companies stocks hammered | Sakshi
Sakshi News home page

ఎవ్వరిదీ పైసా ఉంచుకోను...క్షమించండి!

Published Sat, Jan 26 2019 1:37 AM | Last Updated on Sat, Jan 26 2019 5:17 PM

Essel group companies stocks hammered - Sakshi

ముంబై: ఎస్సెల్‌ గ్రూప్‌ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర ఎట్టకేలకు పెదవి విప్పారు. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. దీన్నుంచి బైటపడే క్రమంలో కీలకమైన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీఈఈఎల్‌)లో వాటాలను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని శక్తులు పడనివ్వడం లేదని ఆరోపించారు. ఇన్‌ఫ్రా పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని, వీడియోకాన్‌కి చెందిన డీ2హెచ్‌ వ్యాపారం కొనుగోలు కూడా కలిసి రాలేదని పేర్కొన్నారు. శుక్రవారం రుణదాతలకు రాసిన బహిరంగ లేఖలో సుభాష్‌ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు. 

తొందరపడితే మీకే నష్టం..
రుణదాతలకు క్షమాపణ చెప్పిన సుభాష్‌ చంద్ర .. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలని కోరారు. అలా కాకుండా తొందరపాటుతనంతో వ్యవహరిస్తే.. రెండు వర్గాలూ నష్టపోక తప్పదని వ్యాఖ్యానించారు. అయితే, మొత్తం అప్పు ఎంత ఉన్నది, ఎగవేతలేమైనా జరిగాయా లాంటి అంశాలు ఆయన ప్రస్తావించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం రుణాల రోలోవర్‌ కష్టంగా మారిందని, అయితే డిసెంబర్‌ దాకా చెల్లింపులన్నీ సక్రమంగానే జరపగలిగామని పేర్కొన్నారు.

‘నా ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ బ్యాంకర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆశించినట్లుగా పనిచేయలేకపోయాయని నేను భావిస్తున్నాను. ఇందుకుగాను క్షమాపణలు  చెబుతున్నాను. ఎవ్వరిదీ ఒక్క పైసా రుణం కూడా ఉంచుకోబోను. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయితే అన్ని రుణాలను తీర్చేయగలుగుతాము. అప్పటిదాకా ఓర్పు వహించండి. కానీ ఆందోళనతో, అరాచకంగా స్పందిస్తే దాని వల్ల మీరూ, మేమూ నష్టపోవాల్సి వస్తుంది‘ అని చంద్ర పేర్కొన్నారు. 

తప్పులు జరిగాయి..
గతేడాది జూన్‌ నుంచి సమస్యలు వెన్నాడుతున్నాయని, రుణదాతలు.. షేర్‌హోల్డర్లకు గుర్తుతెలియని శక్తులు లేఖలు రాస్తూ గందరగోళపరుస్తున్నాయని సుభాష్‌ చంద్ర చెప్పారు. తన వంతుగా కొన్ని తప్పులు కూడా జరిగాయని ఆయన తెలిపారు. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కారణగా రూ. 4,000–5,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే 2016 నవంబర్‌లో వీడియోకాన్‌ డీ2హెచ్‌ వ్యాపారం కొనుగోలుతో బోలెడంత నష్టపోయామని చెప్పారు. ఇక కుటుంబ వ్యాపార విభజన సమయంలో గ్రూప్‌ కంపెనీల రుణభారమంతా తమపైనే వేసుకోవడం మరో పెద్ద తప్పిదమని పేర్కొన్నారు.

షేర్లు ఢమాల్‌...
డీమోనిటైజేషన్‌ తర్వాత భారీ డిపాజిట్లు చేయడంపై  ఎస్‌ఎఫ్‌ఐవో విచారణ ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థల పేర్లున్నాయని వార్తలు రావడంతో గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. డిష్‌ టీవీ 33%, జీలెర్న్‌ 19%, ఎస్సెల్‌ ప్యాక్‌ 12% క్షీణించాయి. జీ గ్రూప్‌  మార్కెట్‌ విలువ రూ. 14,000 కోట్లు పడిపోయింది.  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 26% క్షీణించి రూ. 319కి పడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement