మార్కెట్ పంచాంగం
గత రెండు వారాల్లో మార్కెట్ పెరగడానికి కారణం ప్రపంచ సానుకూల ట్రెండే తప్ప బడ్జెట్ అంచనాలు కాదని, ఫలితంగా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సాదాసీదాగా వున్నా, మార్కెట్‌కు పతన ప్రమాదం లేదంటూ గత కాలమ్‌లో సూచించాము. ఇదే క్రమంలో బడ్జెట్ రోజున భారత్ స్టాక్ సూచీలు 4 వారాల గరిష్టస్థాయిలో ముగిసాయి. ముఖ్యంగా గతవారం చివరి రెండురోజుల్లో అత్యధిక ట్రేడింగ్ పరిమాణంతో సూచీలు పెరిగినందున, వెనువెంటనే పెద్దగా క్షీణించే అవకాశం లేదు.
అయితే సూచీల్లో ఎక్కువ వెయిటేజీ వున్న ఐటీసీ షేరు రికార్డు గరిష్టస్థాయి నుంచి భారీ టర్నోవర్‌తో 8 శాతం పతనంకావడం ఆందోళనకారకం. ఇప్పటివరకూ సూచీలు గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి ఐటీసీ సహకరిస్తూ వచ్చింది. ఇక నుంచి అప్‌ట్రెండ్ కొనసాగాలంటే ఐటీ, ఫార్మా షేర్లతో మరిన్ని రంగాల షేర్లు జతకలవాల్సివుంటుంది. ఇక సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 28తో ముగిసిన 6 రోజుల ట్రేడింగ్‌వారంలో 28,694-29,560 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 130 పాయింట్ల లాభంతో 29,361 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించినట్లు సెన్సెక్స్‌ను 29,500-600 శ్రేణి నిరోధించింది. రెండు వారాలుగా అవరోధం కల్పించిన ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్భంలో 29,800 స్థాయికి చేరవచ్చు. ఆపైన స్థిరపడితే క్రమేపీ 30,100 స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం 29,500-600 శ్రేణిపైన ముగియలేకపోతే 28,970 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 28,880-28,690 పాయింట్ల మద్దతు శ్రేణి కీలకం. ఈ శ్రేణి దిగువన ముగిస్తే మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లవచ్చు.
నిఫ్టీ కీలక నిరోధం 8,965
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,670-8,941 కదిలిన తర్వాత చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 8,902 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి నెలలో 8,996 పాయింట్ల వరకూ ర్యాలీ జరిగిన సందర్భంగా 8,965 స్థాయి నుంచి అధిక ట్రేడింగ్ పరిమాణంతో నిఫ్టీ పడిపోయింది. ఈ కారణంగా వచ్చేవారం 8,965 పాయింట్ల నిరోధస్థాయిని దాటి, స్థిరపడితేనే తర్వాతి అప్‌ట్రెండ్ కొనసాగుతుంది. అటుపైన శరవేగంగా 9,030 పాయింట్ల వద్దకు ర్యాలీ జరగవచ్చు.
8,965 స్థాయిపైన కొద్దిరోజులపాటు నిలదొక్కుకోగలిగితే, క్రమేపీ 9,200 పాయింట్ల స్థాయికి కూడా నిఫ్టీ పెరిగే ఛాన్స్ వుంది. తొలి నిరోధంపైన స్థిరపడలేకపోతే 8,750 స్థాయికి తగ్గవచ్చు. గత నాలుగురోజుల్లో రెండు సందర్భాల్లో ఈ స్థాయి నిఫ్టీని సంరక్షించింది. ఈ స్థాయిని కోల్పోతే తిరిగి 8,670 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. రానున్న రోజుల్లో నిఫ్టీ ఈ స్థాయి దిగువన ముగిస్తే, మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తే ప్రమాదం వుంటుంది.
29,600పైన స్థిరపడితే ర్యాలీ
Published Mon, Mar 2 2015 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement