ఆధార్ కార్డ్ జారీలో జరిగిన నిర్వాకం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు ఆధార్ కార్డ్ గోప్యతపై అందోళనలు కొనసాగుతుండగానే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఒకే గ్రామంలోని 800 మందికి ఒకే పుట్టిన తేదీతో ఆధార్ కార్డ్ జారీ కావడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామ ప్రజలకు ఇటీవల జారీ చేసిన కొత్త ఆధార్ కార్డుల్లో 8వందలమందికిపైగా గ్రామస్తులకు పుట్టిన రోజు జనవరి 1 అని నమోదైంది. ఈ వ్యవహారంపై గ్రామస్తులు మండిపడితున్నారు. ఆధార్ కార్డ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందుతామని అధికారులు చెప్పారు. కానీ దీంట్లో ప్రత్యేకమైనది ఏమిటి? అని అల్ఫాదీన్ ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిన నేపథ్యంలో తాజా వివాదంతో వాటిని నష్టపోతామని గ్రామస్తులు భయపడుతున్నారని డిప్యూటీ గ్రామ పంచాయితీ అధికారి మొహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు.
అయితే ఈ తప్పిదాన్ని గుర్తించడానికి నిరాకరించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇది సాంకేతిక తప్పిదమని చెబుతోంది. త్వరలోనే సమస్యను పరిష‍్కరిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే పుట్టిన తేదీ తెలిసిన వారు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అందుబాటులో ఉన్నఆధార్ కేంద్రాల ద్వారా అప్‌డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది.
మరోవైపు ఈ ఘటనపై హరిద్వార్ డివిజినల్ మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందనీ, కారణాలపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గత ఆగస్టులో కూడా ఆగ్రా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. గ్రామంలోని అందరి డేట్‌ఆఫ్‌బర్త్ జనవరి 1గా నమోదైందని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. కాగా ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ కచ్చితంగా తెలియనివారి వారి పుట్టినతేదీ జనవరి 1గా నమోదవుతుందని మేలో యూఐడీఏఐ ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment