ఫండ్లా... లేక షేర్లా? | Experts Suggestions about stock market investments | Sakshi
Sakshi News home page

ఫండ్లా... లేక షేర్లా?

Published Mon, Oct 1 2018 1:37 AM | Last Updated on Mon, Oct 1 2018 4:53 AM

Experts Suggestions about stock market investments - Sakshi

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందుదామనే అభిలాష నేటి తరం వారిలో ఎక్కువగానే కనిపిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై వీరిలో అవగాహన కూడా నానాటికీ పెరుగుతోంది. అయితే, ఎక్కువ మందికి ఈ విషయంలో ఎదురయ్యే సాధారణ ప్రశ్న ఏమిటంటే... నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా లేక మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలా?.

ఈ ప్రశ్నకు సమాధానం ఎలా ఉన్నా... చాలా మంది నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికే ఆకర్షితులవుతుంటారు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా అదే పని చేస్తుంటాయి...అదేదో తాము చేయలేమా? అన్నది వారి అభిప్రాయం. అయితే, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడమనేది పూర్తిగా భిన్నమైన ఆట. ఈ రెండు రకాల ఇన్వెస్ట్‌మెంట్లకూ ఉన్న తేడాలపై... నిపుణులు చెప్పిన సూచనల ఆధారంగా అందిస్తున్న కథనమిది.. – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం చాలా సులభమన్నది కొందరి అభిప్రాయం. ఆసక్తి కలిగించే టిప్స్‌ ఆధారంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, ఆ తర్వాత స్వల్పకాలంలోనే అది ఎన్నో రెట్లు పెరుగుతుందని వేచి చూడటం సాధారణంగా చేసే పని. కానీ, ఇది నిజం కాదనేది అనుభవజ్ఞులైన స్టాక్‌ ఇన్వెస్టర్లకు తెలుసు. ఇందుకు ఎంతో పరిజ్ఞానం, అనుభవంతో పాటు కంపెనీ బ్యాలెన్స్‌ షీట్లు అధ్యయనం చేయటం... వాటి ఆధారంగా సరైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవటం వంటివన్నీ చేయాలనేది వారు చెబుతారు.

మరికొందరు అవగాహన కోసం, అనుభవం కోసం ఎంతో సమయం వెచ్చిస్తుంటారు. కానీ, ఆ తర్వాత కూడా తప్పిదాలు చేస్తూనే ఉంటారు. అందుకే స్టాక్స్‌లో పెట్టుబడులు అన్నవి చిన్న పిల్లల ఆట మాదిరి కాదు. సరైన స్టాక్స్‌ ఎంపికకు ఎన్నో ఏళ్ల శ్రమ, ప్రావీణ్యం అవసరం. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయానికొస్తే ఇంత ప్రావీణ్యం అవసరం లేదు. స్టాక్స్‌ ఇన్వెస్టింగ్‌ కోసం తగినంత సమయం కేటాయించలేని వారి కోసం ఉన్నవే మ్యూచువల్‌ ఫండ్స్‌. కాకపోతే తమకు తగిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఎంపిక చేసుకుంటే చాలు. కొన్ని ప్రాథమిక సూత్రాల ఆధారంగా మంచి ఫండ్‌ పథకాన్ని సులభంగానే ఎంచుకోవచ్చు. లేదా మ్యూచువల్‌ ఫండ్‌ అడ్వైజర్‌ నుంచి సలహాలు పొందొచ్చు.

నియంత్రణ ఉండదు...
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిపుణులైన ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. కనుక ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలి, వేటి నుంచి బయటపడాలి అన్నది ఫండ్‌ మేనేజర్లే నిర్ణయిస్తుంటారు. కేవలం పెట్టుబడి పెట్టి దాన్ని మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌కు అప్పగించడం వరకే ఇన్వెస్టర్‌ శ్రమ. స్టాక్స్‌ ఎంపికలో ఇన్వెస్టర్ల పాత్ర ఉండదు. కానీ, స్వయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఏ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్న నియంత్రణ ఉంటుంది. అంటే తమ ఈక్విటీలకు తామే ఫండ్‌ మేనేజర్‌ మాదిరి. తమకున్న పరిజ్ఞానం మేరకో, ఎవరో చెప్పారనో నచ్చిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది. కానీ, ఈ పనిని నిపుణులు నిర్వహించడం వల్ల వచ్చే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

ప్రొఫెషనల్‌ మేనేజర్‌...
ఓ విమానాన్ని పైలట్‌ నడపడానికి, డాక్టర్‌ నడపడానికి మధ్య తేడా ఉంటుంది. ఫ్లయింగ్‌ అర్హతలు లేని డాక్టర్‌ విమానాన్ని నడిపితే అది కూలిపోయే ప్రమాదాలే ఎక్కువ. ఈక్విటీలకు కూడా ఇదే వర్తిస్తుంది. మ్యూచువల్‌ ఫండ్‌ను వృత్తిపరంగా నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తూ ఉంటారు. వీరు ఆర్థిక రంగం, క్రెడిట్‌ సైకిల్, వడ్డీ రేట్ల తీరుతెన్నులు, కంపెనీల మూలాల పరిశీలన, పన్నులు, వ్యాపారాలు, పలు దేశాల ఈక్విటీ మార్కెట్ల గమనం, విశ్లేషణ తదితర అంశాల్లో నిష్ణాతులై ఉంటారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉంటుంది. సంపద నిర్వహణలో కోర్సులు చేసి ఉంటారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ పని విధానం...
మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ఏ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి, ఏ స్టాక్స్‌ను విక్రయించాలి అన్నది ఆషామాషీగా నిర్ణయించుకోరు. ఆయా కంపెనీలు వ్యాపారం, ఆయా రంగాలపై లోతైన అవగాహన, ఆర్థికాంశాల విశ్లేషణ ఆధారంగానే నిర్ణయాలు తీసుకో వడం జరుగుతుంది. కంపెనీ లు, వాటి ఫ్యాక్టరీలను సందర్శించ డంతోపాటు, ఉన్నత స్థాయి యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరిపి సమాచారం సేకరిస్తారు.

కంపెనీల్లో అంతర్గతంగా ఏమి జరుగుతోంది? కంపెనీల భవిష్యత్తు గురించి మెరుగ్గా అంచనా వేయగలరు. ఏ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి, ఎప్పుడు, ఎంత మేర అన్నది 5–20 మంది అనలిస్టులతో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతుంది. ఇది సాధారణ వ్యక్తులకు కష్ట సాధ్యం. అయినప్పటికీ చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు, తమకున్న కొన్నేళ్ల అనుభవం ఆధారంగా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి విజయం సాధించగలమని నమ్ముతుంటారు.

ఉదాహరణకు టీసీఎస్‌ ఉద్యోగి తన కంప్యూటర్‌ ముందు కూర్చుని, హాట్‌ టిప్స్‌ ఆధారంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సులభమే. ఓ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ మాదిరిగా తాను కూడా తన పెట్టుబడుల్లో విజయం సాధించగలిగితే కేవలం రూ.లక్షల్లో ఉన్న ఉద్యోగంలోనే ఎందుకు కొనసాగాలి...? ముంబై వెళ్లి మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ అవతారం ఎత్తితే రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోవచ్చు కదా!!.

ఆటుపోట్లు, రాబడులు..
అన్నింటికంటే ఇది చాలా కీలకమైనది. ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటే, సంబంధిత పథకం 30–100 స్టాక్స్‌ మధ్య పెట్టుబడులను వర్గీకరించడం జరుగుతుంది. లాభాలు, నష్టాలు అన్నవి చాలా స్టాక్స్‌పై ఆధారపడి ఉంటాయి. అంటే రిస్క్‌ అన్నది ఏ ఒకటి రెండు స్టాక్స్‌ లేదా ఐదు స్టాక్స్‌పై కాకుండా, ఎన్నో స్టాక్స్‌ మధ్య విభజించి ఉంటుంది. దీంతో రాబడులు సగటుగా మారతాయి. ఓ స్టాక్‌ 100 శాతం రాబడులను ఇస్తే, మరో స్టాక్‌ 50 శాతం, ఇంకో స్టాక్‌ కేవలం 5 శాతం రాబడులనే ఇవ్వొచ్చు.

అన్నీ కలిపి సగటున మారడంతో ఈక్విటీ ఫండ్స్‌పై రాబడులు మధ్య నుంచి దీర్ఘకాలంలో 10 శాతం నుంచి 25 శాతం మధ్య ఉంటుంటాయి. నేరుగా ఓ నాలుగైదు స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కంటే ఇలా మ్యూచువల్‌ ఫండ్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ తక్కువ, రాబడులు తక్కువ అనే తరహాలో ఉంటుంది. అదే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే గరిష్టంగా ఎన్ని స్టాక్స్‌కు తమ పెట్టుబడులను కేటాయించాలి, రాబడులు ఏమేరకు, రిస్క్‌ తదితర అంశాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఎక్కువ మంది 5–10 స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తుండటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం రెండు మూడు స్టాక్స్‌లోనే రూ.లక్షలాదిగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు.

కానీ, ఒక్కో స్టాక్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉండటం వల్ల ఏదైనా మార్పులు జరిగితే రాబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక రాబడులు, నష్టాలను నిర్వహించే నేర్పు చాలా మందిలో ఉండదు. రాబడులు కనిపిస్తే అమ్మేస్తుంటారు. అదే సమయంలో నష్టాల్లోకి వెళ్లినా భయంతో అమ్మేసి బయటపడుతుంటారు. తొందరగా బయటపడిపోదామన్న ఆలోచన తప్పిస్తే... ఆటలోనే కొనసాగుదామన్న ఆలోచన రాదు. ఎందుకంటే భావోద్వేగాలు వారిని కుదురుగా ఉండనీయవు. అదే మ్యూచువల్‌ ఫండ్స్‌లో అయితే పదేళ్ల పాటు కూడా స్థిరంగా ఇన్వెస్ట్‌ చేయగలరు. కానీ, ఒకే స్టాక్‌లో పదేళ్లు కొనసాగడం అన్నది సాధారణ ఇన్వెస్టర్లలో కనిపించదు.


సిప్‌ మార్గం...
మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారికి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంది. ప్రతీ వారం లేదా నెలకోసారి ఇలా నిర్ణీత మొత్తం ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి సిప్‌ మార్గంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు వెళ్లడం అన్నది మంచి ఆప్షన్‌ అవుతుంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ అలవాటుగా మారుతుంది. అదే స్టాక్స్‌ విషయానికొస్తే... ప్రతి నెలా ఎంచుకున్న స్టాక్స్‌లో స్వయంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. వాస్తవికంగా ఇది ఓ పెద్ద సవాలు వంటిదే. ఎందుకంటే అంత కచ్చితంగా క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేసే వారు తక్కువ మందే ఉంటారు. కొందరు కొన్ని నెలల పాటు కచ్చితంగా చేసినా, ఆ తర్వాత తమ నిర్ణయం మారిపోతుంది. తమ ఆలోచన, దృక్పథంలో మార్పు వస్తుంది.

సెక్షన్‌  80సీ ప్రయోజనం...
ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రయోజనానికి అదనంగా సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు పొందొచ్చు. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఈ ప్రయోజనం లేదు.


అనుభవంలేని వారి కోసమే మ్యూచువల్‌ ఫండ్స్‌..
తగినంత అనుభవం లేని వారు, సమయం కేటా యించలేని వారి కోసమే మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నవి సృష్టించబడ్డాయి. ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత తమ పాత్ర చాలా పరిమితం. నిర్ణీత సమయానికోసారి రాబ డులు తాము ఆశించిన మేరకు, తమ లక్ష్య సాధనకు అనుగుణంగా ఉన్నాయా, లేవా అన్నది సమీక్షించు కుంటే సరిపోతుంది. అయినా సరే స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, అది డే ట్రేడింగ్‌ మాదిరిగా ఉండరాదు. కంపెనీలను అధ్యయనం చేయడం, పోర్ట్‌ఫోలియోలోని ప్రతీ కంపెనీలో ఏం జరుగుతోం దన్నది పరిశీలిస్తూ వెళ్లాలి. యాక్టివ్‌గా ఉండాలి, అదే సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.

భావోద్వేగాలు..
తగిన పరిశోధన తర్వాత నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు, ఆ తర్వాత తమ నిర్ణయం తప్పుగా మారితే అంగీకరించేందుకు సిద్ధపడరు. కొనుగోలుకు సంబంధించి దూకుడుగా నిర్ణయం తీసుకున్న వారు, అమ్మకానికి వచ్చే సరికి అలా చేయరు. చేసిన తప్పు ను నష్టానిౖMðనా సరిదిద్దుకునేందుకు వారి మనసు అంగీకరించదు. దాంతో నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను అమ్మడం ఇష్టం లేక ఏళ్ల తరబడి వాటిని అలానే ఉంచేసుకుని నష్టపోతుంటారు. ఆయా అంశాల నేపథ్యంలో  అందువల్ల  భావోద్వేగా లను నియం త్రించుకోలేని వారికి ఫండ్స్‌ మెరుగైన మార్గం.

ఫీజులు...
నేరుగా స్టాక్స్‌ను కొనుగోలు చేసి, విక్రయించేవారు డీమ్యాట్‌ అకౌంట్‌ చార్జీలను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్, ఇతర లావాదేవీల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్స్‌పెన్స్‌ రేషియో పేరుతో వ్యయాలను భరించాల్సి వస్తుంది. ఫండ్స్‌ నికర విలువ ఆధారంగా ప్రతీ రోజూ దీన్ని మినహాయించడం జరుగుతుంది. ఫండ్‌ యూనిట్ల ఎన్‌ఏవీలు రోజూ మారుతుంటాయి.

స్టాక్స్‌ క్లోజింగ్‌ ధర, ఎక్స్‌పెన్స్‌ రేషియోను మినహాయించిన తర్వాత చూపించేదే ఎన్‌ఏవీ. ఎక్స్‌పెన్స్‌ రేషియో అన్నది ఈక్విటీ ఫండ్స్‌పై 1–2.5 శాతం మధ్య ఉంటుంది. ఇలా చూసినప్పుడు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే చౌక. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌కు తగ్గకుండా రాబడులను రాబట్టుకునే నైపుణ్యం ఉంటేనే ఆ మార్గాన్ని ఆశ్రయించాలి. నిజంగా ఆ నైపుణ్యం ఉన్న వారు ఫండ్స్‌ కంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే నయం. ఇది సాధ్యం కానప్పుడు, మీ తరఫున ఓ ఫండ్‌ మేనేజర్‌ గరిష్ట రాబడులను తీసుకొచ్చే పని చేస్తున్నప్పుడు ఈ వ్యయాలు భరించడం సహేతుకమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement