
మోదీ ప్రతిష్ట మసకబారుతోంది
- ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ, ఎన్టీపీసీ సీఎండీ అరూప్ రాయ్ చౌదరిల పదవీకాలాన్ని న్యాయబద్ధంగా కేంద్రం పొడిగించకపోవడాన్ని ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తప్పుపట్టారు. పీఎస్‌యూలకు సాధికారత కల్పించడమన్నది ఒట్టి బూటకమేనని ఇలాంటి చర్యలు సూచిస్తున్నాయన్నారు. ఇలాంటివి ఆధునిక భారత నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట మసకబార్చేవిగా ఉన్నాయని శర్మ
వ్యాఖ్యానించారు.
వివిధ టాస్క్‌ఫోర్సులు, ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న శర్మ.. ప్రధానికి రాసిన లేఖలో ఈ అంశాలను ప్రస్తావించారు. అర్హతలను పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం నియమించిందన్న ఒకే ఒక కారణంతో పీఎస్‌యూ బోర్డుల నుంచి స్వతంత్ర డెరైక్టర్లను తొలగించడం సరికాదని శర్మ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో పరిపాలన అత్యంత కనిష్ట స్థాయులకు దిగజారుతోందని, పీఎస్‌యూ సిబ్బంది నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.
లిస్టయిన 45 పీఎస్‌యూల్లో 28 సంస్థల బోర్డుల్లో కనీసం ఒక్క స్వతంత్ర డెరైక్టరు కూడా లేరని శర్మ తెలిపారు. 2019 సెప్టెంబర్‌లో రిటైరయ్యే దాకా సెయిల్ చైర్మన్ వర్మ పదవీకాలాన్ని పొడిగించేందుకు నిరాకరించిన కేంద్రం.. తాజాగా ఎన్‌టీపీసీ సీఎం డీ చౌదరి పదవీకాలాన్ని కూడా పొడిగించకూడదని నిర్ణయించింది. వీరికి అరవై ఏళ్లు వచ్చే దాకా పదవీకాలాన్ని పొడి గించేందుకు ఆస్కారమున్నా కేంద్రం నిరాకరించడం సరికాదని శర్మ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి భిన్నంగా ప్రభుత్వ రంగంలో అత్యంత సమర్థులకు సైతం అత్యున్నత పదవులను ఒక పర్యాయానికి మాత్రమే పరిమితం చేయడం వల్ల పీఎస్‌యూ అధికారులు బోర్డు స్థాయి పదవులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిపై చర్చించేందుకు తనకు సమయం కేటాయించాలంటూ మోదీని శర్మ కోరారు.