శాన్‌ఫ్రాన్సిస్కో : ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఎదుర్కొంటున్న డేటా చోరి సంక్షోభం, తన ఫలితాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బుధవారం ప్రకటించిన తొలి క్వార్టర్ లాభాల్లో ఫేస్‌బుక్ ఆల్-టైమ్ హై స్థాయిని రికార్డు చేసింది. కంపెనీ నికర లాభాలు ఈ క్వార్టర్‌లో దాదాపు 65 శాతం మేర జంప్ చేశాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 4.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదేవిధంగా రెన్యూలు 49 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చిన రెవెన్యూలు అగ్రస్థానంలో ఉన్నాయి. మార్చి నుంచి కొనసాగుతున్న ప్రైవసీ స్కాండల్‌తో ఫేస్‌బుక్ సతమతమవుతున్నా.. ఈ ఫలితాలు ఆ కంపెనీకి కాస్త ఊరట కలిగించాయి. గతేడాది కంటే కూడా ఈ ఏడాదే రోజుకు 13 శాతం ఎక్కువ మంది ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతున్నట్టు కంపెనీ పేర్కొంది.
అయితే ప్రస్తుతం నెలకొన్న డేటా స్కాండల్ ప్రభావం రెండో క్వార్టర్‌లో చూపించవచ్చని విశ్లేషకులంటున్నారు. యూజర్ల ప్రమేయం లేకుండా ఫేస్‌బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికాతో యూజర్ల డేటా పంచుకుందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఫేస్‌బుక్ డిలీట్ అనే ఉద్యమం నడుస్తోంది. ఇన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ, తమకు 2018 ఏడాది చాలా బలంగా ప్రారంభమైందని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. డేటా స్కాండల్‌పై పలు క్లాస్ యాక్షన్ దావాలను ఫేస్‌బుక్ ఎదుర్కొంటోంది. ఈ వివాదంతో స్టాక్ కూడా 14 శాతం కిందకి పడిపోయింది. అయితే బలమైన క్వార్టర్ ఫలితాలను ఫేస్‌బుక్ ప్రకటించడంతో ఫేస్‌బుక్ షేర్లు పుంజుకుని, 4 శాతానికి పైగా లాభాలు పండిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment