ఫడరల్ బ్యాంక్ బేస్‌రేట్ తగ్గింపు
ఈ నెల 18 నుంచి వర్తింపు
న్యూఢిల్లీ: ఫెడరల్ బ్యాంక్ బేస్‌రేటును పావు శాతం తగ్గించింది. 10.2 శాతంగా ఉన్న బేస్‌రేట్‌ను 9.95 శాతానికి తగ్గించామని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 18 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. కీలక రేట్లను ఇటీవల ఆర్‌బీఐ పావు శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు బేస్‌రేట్‌ను తగ్గించాయి. ఎస్‌బీఐ, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌లు ఇప్పటికే బేస్‌రేట్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. బేస్ రేట్ తగ్గింపు నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.133 వద్ద ముగిసింది.
ఇండియన్ బ్యాంక్ తగ్గింపు 30 బేసిస్ పాయింట్లు
ఇండియన్ బ్యాంక్ బేస్‌రేట్‌ను, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్(బీపీఎల్‌ఆర్)ను చెరో 30 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించింది. 10.25 శాతంగా ఉన్న బేస్‌రేట్‌ను 9.95 శాతానికి, అలాగే బీపీఎల్‌ఆర్‌ను 14.50 శాతం నుంచి 14.2 శాతానికి తగ్గించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. బీఎస్‌ఈలో ఈ షేర్ 3.6 శాతం నష్టపోయి రూ.146 వద్ద ముగిసింది.