
ఈ కారు ధర రూ. 3.4 కోట్లు
ఫెరారి కాలిఫోర్నియాలో కొత్త వేరియంట్
ముంబై: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ ఫెరారి తన ‘కాలిఫోర్నియా’ మోడల్‌లో కొత్తగా టర్బోచార్జ్‌డ్ వేరియంట్ ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. కాలిఫోర్నియా టీ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.3.4 కోట్లని కంపెనీ పేర్కొంది. ఈ కారుకు ఇప్పటికే ఎనిమిది బుకింగ్‌లు వచ్చాయని ఫెరారి వెస్ట్ ఏషియా, ఆఫ్రికా హెడ్ అరెలియన్ సౌవార్డ్ చెప్పారు. నెలరోజుల్లోపు ఈ కార్లను డెలివరీ చేస్తామని వివరించారు. ఈ ఏడాది 20 కార్లు అమ్ముడవుతాయని అంచనాలున్నాయని చెప్పారు. ఈ కాలిఫోర్నియా మోడల్‌ను ఫెరారి కంపెనీ 1950లో మార్కెట్లోకి తెచ్చింది.
కారు ప్రత్యేకతలు...
8 సిలిండర్ల టర్బోచార్జ్‌డ్ 3,855 సీసీ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు గరిష్ట వేగం గంటకు 316 కి.మీ. అని, వంద కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలో అందుకుంటుందని, ఈ వేరియంట్ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని అరెలియన్ వివరించారు. మరింత స్థిరత్వం కోసం ఎఫ్ 1 ట్రాక్ సిస్టమ్, బ్రేక్‌లు పటిష్టంగా పనిచేయడానికి కార్బన్ సిరామిక్ బ్రేక్‌లు, 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డ్యుయల్ క్లచ్, 7 గేర్లు, తదితర ఫీచర్లున్న ఈ కారు లీటర్‌కు 9.5 కి.మీ. మైలేజీని ఇస్తుందని తెలిపారు.