హెచ్‌డీఎఫ్‌సీలో 78%కు ఎఫ్‌ఐఐల వాటా
న్యూఢిల్లీ: మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడి రికార్డు స్థాయికి చేరింది. సెప్టెంబర్ చివరికి కంపెనీలో ఎఫ్‌ఐఐల వాటా 78%కు చేరింది. సెన్సెక్స్‌లో భాగమైన కంపెనీలలో ఎఫ్‌ఐఐల పెట్టుబడి 75%ను మించడం ఇదే తొలిసారి. వెరసి ఎఫ్‌ఐఐలకు అత్యధిక శాతం వాటా కలిగిన బ్లూచిప్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.
గతేడాది(2013-14) జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీలో ఎఫ్‌ఐఐల వాటా 73.09%. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ వాటా 77.85%ను తాకింది. ఇది కొత్త రికార్డుకావడం గమనార్హం. 2012లో కంపెనీ బోర్డు ఎఫ్‌ఐఐల పెట్టుబడి పరిమితిని 100%కు పెంచేందుకు ఓకే చెప్పడం తెలిసిందే. బీఎస్‌ఈలో కంపెనీ షేరు సోమవారం(3న) 1% లాభపడి రూ. 1,118 వద్ద ముగిసింది.