పన్ను వసూళ్లలో సముచితంగా వ్యవహరించాలి
ఐఆర్‌ఎస్ అధికారులతో ఆర్థిక మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: పన్ను వసూళ్ల విషయంలో ‘స్థిరంగాను, సముచితంగాను’ వ్యవహరించాలని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. పన్ను వసూలు అధికారులు ఎటువంటి మినహాయింపులు, డిస్కౌంట్లూ ఇవ్వరాదన్నారు. ఐఆర్‌ఎస్ (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్) ప్రొబేషనర్ల 66వ బ్యాచ్ శిక్షణను ప్రారంభించిన సందర్భంగా అరుణ్ జైట్లీ ఈ విషయాలు చెప్పారు.
ఏ విధమైన పన్నులు విధించాలి, ఎలాంటివి విధించకూడదు అన్న అంశంలో సమతౌల్యత పాటించాలని సూచించారు. ‘పన్నుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. పన్నుల పరిధిలోకి వచ్చే వాటిపై విధించడం, రాని వాటిపై పన్నుల భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీరు సమతౌల్యత పాటించగలగాలి’ అని జైట్లీ చెప్పారు. 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే వస్తు, సేవల పన్నుల(జీఎస్‌టీ) విధానం తీరుతెన్నులను ఆకళింపు చేసుకుని, సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు.