ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలి: జైట్లీ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వడ్డీ రేట్ల తగ్గింపు అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తంచేశారు. ‘జూన్‌లోనూ, ఈ నెలలోనూ రిజర్వ్ బ్యాంకు రుణ సమీక్ష ప్రకటనల అనంతరం అభివృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆర్థిక శాఖ వైఖరిని తేటతెల్లం చేస్తూ ప్రకటనలిచ్చాను.
వడ్డీ రేట్లను నిర్ణయించాల్సింది రిజర్వ్ బ్యాంకే. వివిధ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుందని భావిస్తున్నాను..’ అని ఆదివారం ఇక్కడ ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డులో ప్రసంగించిన అనంతరం మీడియాతో జైట్లీ చెప్పారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడిన తర్వాత నిర్వహించిన రెండు రుణ సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. అభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి.
జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 30 నెలల కనిష్టస్థాయి 7.31 శాతానికి, టోకు ధరల సూచీ నాలుగు నెలల కనిష్టస్థాయి 5.43 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యం వచ్చే జనవరిలో 8 శాతమనీ, 2016 జనవరిలో 6 శాతమనీ చెప్పారు.
ఆధునిక ద్రవ్య విధాన వ్యవస్థకు కసరత్తు
ప్రతిపాదిత ఆధునిక ద్రవ్య విధాన వ్యవస్థపై ప్రాథమిక చర్చలను రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిందని రాజన్ చెప్పారు. ఆర్థిక శాఖతో కలసి నూతన వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు. నానాటికీ సంక్లిష్టమవుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధునిక వ్యవస్థ అవసరమని ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో మంత్రి జైట్లీ పేర్కొన్నారు.