కేబినెట్ నిర్ణయాలను తెలియజేస్తున్న ఆర్థికమంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా తరహా ఆర్థిక నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించి ‘ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు’కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు, రుణం ఎగవేసి అదృశ్యమైన వారికి సంబంధించి అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని వెంటనే విక్రయించే అధికారం ఈ బిల్లు కల్పిస్తుంది. దీంతో నీరవ్ మోదీ తరహా భారీ కుంభకోణాల్లో ఈ చట్టం ప్రకారం ప్రత్యేక కోర్టు అనుమతితో బకాయిలను తక్షణమే రాబట్టుకునేందుకు వీలు పడుతుంది. ఆర్థిక నేరగాళ్లతోపాటు రూ.100 కోట్లకు పైగా రుణ బకాయి పడి విదేశాలకు పారిపోయిన వారికీ ఇదే వరిస్తుంది. మార్చి 5 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదం కోసం ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు తెలిపారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టానికి ఫ్యుజిటివ్ బిల్లు భిన్నమైనదని, ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కల్పిస్తుందని జైట్లీ చెప్పారు. ఈ నూతన చట్టాన్ని పాత నేరస్థులకు సంబంధించిన కేసులకూ వర్తింపజేస్తామన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, నేరం కారణంగా కలిగిన లబ్ధి మేరకే ఆస్తులు జప్తు చేసి వేలం వేసే అధికారం ఉంది. అది కూడా నేరం నిరూపితమైన తర్వాతనే. ఈ కొత్త చట్టం కింద పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు, రుణ ఎగవేతదారులకు సంబంధించి అన్ని ఆస్తులనూ(బినామీ ఆస్తులు సైతం) స్వాధీనం చేసుకోవచ్చు. ఫ్యుజిటివ్ అఫెండర్ అన్నదానికి... నేరాలకు పాల్పడి, నేరపూరిత విచారణ తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన, లేదా విదేశాల నుంచి విచారణకు రావడానికి నిరాకరించేవారికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంటర్ జారీ అవడంగా ఈ బిల్లులో పేర్కొన్నారు. వాస్తవానికి 2017–18 కేంద్ర బడ్జెట్‌లోనే ఈ బిల్లు గురించి పేర్కొన్నారు. రూ.12,700 కోట్ల మేర నీరవ్ మోదీ స్కామ్ ధాటికి కేంద్ర కేబినెట్ దీన్ని శీఘ్రతరం చేసింది. లొంగిపోతే వెసులుబాటు: ‘‘ప్రత్యేక కోర్టులో కేసు విచారణ ప్రక్రియలు కొనసాగుతూ పారిపోయిన ఆర్థిక నేరగాడు అని ప్రకటించకముందే, సదరు వ్యక్తి భారత్‌కు తిరిగొచ్చి కోర్టు ముందు హాజరు అయితే సంబంధిత చట్టం కింద కొనసాగే విచారణ ప్రక్రియలను నిలిపివేయడం జరుగుతుంది’’ అని కేబినెట్ భేటీ తర్వాత విడుదలైన అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
ఆడిటింగ్ సంస్థలపై నియంత్రణ సంస్థ
కంపెనీల్లో భారీ స్కామ్‌లు జరిగిపోతున్నా ఆడిటింగ్ సంస్థలు కళ్లప్పగించి చూస్తుండడం, వాటిని ముందుగానే రిపోర్ట్ చేయలేకపోతుండడంతో వీటిపై పర్యవేక్షణ కోసం ఓ స్వతంత్ర నియంత్రణ సంస్థను ‘నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ)’ పేరుతో ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది. ‘కంపెనీల చట్టం 2013’లో ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఏర్పాటును చేర్చనుంది. ఆడిటర్లు, ఆడిటింగ్ సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం ప్రస్తుతం ఏసీఏఐకు ఉండగా, అవి ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏకు దఖలు పడతాయి. అక్రమాలకు పాల్పడే ఆడిటర్లు, ఆడిటింగ్ సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారాలు ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏకు ఉంటాయి. పీఎన్‌బీలో నీరవ్ మోదీ 12,700 కోట్ల కుంభకోణం, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ఇలా ఎన్నో కార్పొరేట్ స్కాముల్లో ఆడిటింగ్ సంస్థల వైఫల్యాలపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
నీరవ్ మోదీ గ్రూప్ సంస్థల 3 ఖాతాల స్తంభన: ఎస్‌బీఐ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన మూడు ఖాతాలను ఎస్‌బీఐ స్తంభింపజేసింది. మోదీ గ్రూప్ కంపెనీలకు తమ విదేశీ శాఖల్లో మూడు డిపాజిట్ అకౌంట్లు ఉన్నాయని అంతర్గత సమీక్షలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. దుబాయ్, బహ్రెయిన్, యాంట్‌వెర్ప్ శాఖల్లో ఈ అకౌంట్లు గుర్తించినట్లు వివరించాయి. పీఎన్‌బీలో బైటపడిన రూ. 12,600 కోట్ల కుంభకోణానికి ఈ ఖాతాలకు ప్రత్యక్ష ప్రమేయమేదీ లేదని పేర్కొన్నాయి. అయినప్పటికీ.. స్కామ్ విచారణలో తగిన చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment