
భారత్ బ్యాంకింగ్ ‘నెగిటివ్’
♦ డౌన్‌గ్రేడ్ చేసిన ఫిచ్
♦ అధిక మొండిబకాయిల ఫలితం
♦ ‘స్టేబుల్’ నుంచి ‘నెగిటివ్’కు తగ్గింపు
ముంబై: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- ఫిచ్ భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకూ ‘స్టేబుల్’గా ఉన్న అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చింది. అధిక మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యను ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. కార్పొరేట్ ఆదాయాలు బలహీనంగా ఉండడాన్ని మరో కారణంగా చూపింది. ఆయా అంశాలు సమీపకాలంలో సైతం బ్యాంకింగ్‌కు ప్రతికూలంగా ఉంటాయని ఒక నివేదికలో పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే ఈ బ్యాంక్ అనుబంధ న్యూజిలాండ్ విభాగం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లుసహా తొమ్మిది బ్యాంకులకు సంబంధించి లాంగ్‌టర్మ్ రేటింగ్ ‘బీబీబీ-’ కొనసాగిస్తున్నట్లు ఫిచ్ స్పష్టం చేసింది. జంక్‌కు ఇది కేవలం ఒక అంచె ఎక్కువ. కాగా ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐల మూలధన పరిస్థితులు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నట్లు పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న రుణాల అంశం ఇందుకు కారణంగా పేర్కొంది. 2015-16 నాటికి బ్యాంకింగ్ మొండిబకాయిలు 13 శాతానికి పైగా (ఎనిమిది లక్షల కోట్లు) పెరిగిన సంగతి తెలిసిందే.
మరింత తగ్గే అవకాశం...
రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో బ్యాంకింగ్ రుణ నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉందని కూడా తన తాజా నివేదికలో ఫిచ్ పేర్కొంది. మౌలిక రంగం, ఇనుము, ఉక్కు రంగాలకు సంబంధించి అకౌంట్లు ఇంకా ఒత్తిడిలో కొనసాగుతుండడం దీనికి కారణంగా పేర్కొంది. బ్యాంకుల మూలధన పరిస్థితులు చరిత్రాత్మక బలహీన స్థాయిల్లో ఉన్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ బాసెల్ 3 ప్రమాణాలు అనుగుణంగా- 2019 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 90 బిలియన్ డాలర్ల (దాదాపు 6 లక్షల కోట్లు) మూలధనం అవసరమవుతుందన్నది తమ అంచనా అని పేర్కొంది. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కష్టమవుతుందని, ప్రభుత్వమే ఈ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించింది.