వృద్ధి రేటుపై ‘నోటు’ పోటు
• 6.9%కి తగ్గించిన ఫిచ్
• నగదు కొరత ఆర్థిక కార్యకలాపాలకు విఘాతమని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 6.9 శాతానికి ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ తగ్గించింది. నోట్ల రద్దు తర్వాత తాత్కాలికంగా ఆర్థిక రంగ కార్యకలాపాలకు విఘాతం ఉంటుందని స్పష్టం చేసింది. మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం నగదులో రూ.500, రూ.1,000 నోట్ల రూపేణా 86 శాతం విలువకు సమానమైన నోట్లను వెనక్కి తీసుకోవడం వల్ల ఏర్పడిన నగదు కొరత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని వివరించింది.
ఇక 2017-18, 2018-19 సంవత్సరాలకు సైతం వృద్ధి రేటు అంచనాలను 7.7 శాతం, 8 శాతాలకు ఫిచ్ తాజాగా కుదించింది. వ్యవస్థీకృత సంస్కరణల అజెండాను క్రమంగా అమలు చేయడం, ఉద్యోగుల వేతనాలను 24% పెంచడం కారణంగా తర్వాతి సంవత్సరాల్లో అధిక వినియోగం అధిక వృద్ధి రేటుకు తోడ్పడతాయని అంచనా వేస్తున్నట్టు ఫిచ్ నివేదికలో వివరించింది. వృద్ధి రేటు తగ్గుదల నేపథ్యంలో పెట్టుబడుల రికవరీ కొద్దిగా నిదానించవచ్చని పేర్కొంది.
కొనుగోళ్లకు డబ్బుల్లేవ్...
‘‘కొనుగోళ్లకు సరిపడా నగదు వినియోగదారుల వద్ద లేదు. సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నట్టు, రైతులు విత్తనాలు, ఎరువులు కొనలేని పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చారుు. బ్యాంకుల వద్ద క్యూలలో వెచ్చించే సమయంతో ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. ఇవే పరిస్థితులు ఎక్కువ కాలం పాటు కొనసాగితే జీడీపీపై పడే ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల మధ్య కాలానికి జీడీపీపై పడే ప్రభావం విషయంలో స్పష్టత లేదు. కానీ ఇది మరీ అంతగా ఉండకపోవచ్చు’’ అని ఫిచ్ తెలిపింది. అనధికారిక రంగాల్లో ఉన్న వారు ఇప్పటికే కొత్తగా వచ్చిన పెద్ద నోట్లను పొందగలుగుతున్నారని, బంగారం వంటి ఇతర మార్గాల్లో తమ సంపదను నిల్వ చేసుకుంటున్నారని వివరించింది. డిజిటల్ లావాదేవీల దిశగా ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని కూడా పేర్కొంది.