పోర్టల్స్‌లోనే ఫ్లాట్ బుకింగ్! | flat booking in portals | Sakshi
Sakshi News home page

పోర్టల్స్‌లోనే ఫ్లాట్ బుకింగ్!

Published Sat, May 31 2014 1:38 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

పోర్టల్స్‌లోనే ఫ్లాట్ బుకింగ్! - Sakshi

పోర్టల్స్‌లోనే ఫ్లాట్ బుకింగ్!

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సినిమా చూడాలంటే..! భాగ్యనగరం నుంచి ఊరెళ్లాలంటే..!! మహా ప్రయాస. అందుకే చాలా మంది ఆన్‌లైన్‌లోనే మూవీ టికెట్స్‌ను, బస్సు, రైలు సీట్‌ను బుకింగ్ చేసుకుంటారు. మరి అలాంటి అవకాశం సొంతిల్లు కొనడంలోనూ ఉంటే. సరిగ్గా ఇలాంటి ఆలోచనకే తెరలేపింది ‘రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్ ప్రైవేట్ లిమిటెడ్’. మహానగరంలో ప్రాపర్టీ కొనాలంటే బిల్డర్ ఎంపిక దగ్గర నుంచి ప్రాజెక్ట్ లొకేషన్, అందుబాటు ధర, మౌలిక సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. ఇవేవీ లేకుండా నేరుగా ఇంట్లో నుంచే ఫ్లాట్ కొనే అవకాశాన్ని కల్పిస్తోంది ‘ఇంటరాక్టివ్ డైనమిక్ ప్రాజెక్ట్ లే-అవుట్’ (ఐడీపీఎల్). ‘రీడైల్’ ప్రాపర్టీ వెబ్‌సైట్ కథేంటో చదవండి మరి!!

 ప్రస్తుతం redial.in, indiaproperty.com, magicbricks.com, commonfloor.com.. వంటి రియల్టీ పోర్టల్స్‌లో అద్దె ఇల్లు, కొత్త ప్రాజెక్ట్‌లు, వెంచర్లకు సంబంధించిన వివరాలు, ధరలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ‘‘ఇకపై రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్‌లో అలా కాదు. అద్దె, సొంతింటిని వెతుక్కోవడమే కాకుండా నేరుగా కొత్త ప్రాజెక్ట్‌లో మనకు నచ్చిన దిశలో ఫ్లాట్‌ను బుకింగ్ చేసుకోవచ్చు’’ అని రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ వెంకటరమణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా ఇంటరాక్టివ్ డైనమిక్ ప్రాజెక్ట్ లే-అవుట్ (ఐడీపీఎల్) అనే సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టామన్నారు. దీంతో ఆయా ప్రాజెక్ట్‌లు, వెంచర్ల గురించి ప్రచారం చేయడమే కాదు నేరుగా ఆన్‌లైన్‌లో ఫ్లాట్ బుక్ చేసుకునే వీలుంటుంది. దీంతో బిల్డర్లకు మార్కెటింగ్ ఇబ్బందులు తప్పుతాయి. కొనుగోలుదారులకు సమయమూ ఆదా అవుతుందని వెంకటరమణ చెప్పారు.

 అంతా ఉచితమే..
 ఆన్‌లైన్‌లో ఫ్లాట్ బుక్ చేసుకునేందుకు కొనుగోలుదారులు చిల్లి గవ్వ చెల్లించక్కర్లేదు. అంతా ఉచితంగా పొందవచ్చు. అయితే ఆయా ప్రాజెక్ట్‌లకు ప్రచారం, బుకింగ్ చేస్తున్నందుకు గాను నిర్మాణ సంస్థలు కొంతమేర చెల్లించాలి. సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే మూడు విభాగాల్లో ధరలుంటాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు నెలకు సిల్వర్ అయితే రూ.5 వేలు, గోల్డ్ అయితే రూ.10 వేలు, ప్లాటినం అయితే రూ. 15 వేలుగా ధరలు నిర్ణయించారు.

ప్రాజెక్ట్ విస్తీర్ణం, ప్రాంతమేదైనా సరే ధరల్లో తేడాల్లేవు. ఇప్పటివరకు ఐడీపీఎల్‌లో జేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, రాయల్ ఇండియా ఇన్‌ఫ్రా డెవలపర్స్, మన్‌సన్ కన్‌స్ట్రక్షన్స్, స్కై స్పేస్, శ్రీ వైషు, భాష్యం డెవలపర్స్, శ్రీదుర్గ ఎస్టేట్స్, ఇస్తా హోమ్స్ వంటి పది వరకు నిర్మాణ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి. ఆదిభట్ల, ఉప్పల్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఆయా సంస్థల నిర్మాణాలున్నాయి. ఫ్లాట్‌ను ఎంచుకోగానే దాని పక్కనే బిల్డర్ ఫోన్ నంబర్ ఉంటుంది. దీంతో నేరుగా బిల్డర్‌తోనే బేరసారాలు చేసుకోవచ్చు. ఫ్లాట్ బుకింగ్ కాగానే వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేస్తారు. బిల్డర్లు ప్రకటించే రాయితీలు, ఆఫర్ల వంటివి కూడా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతుంటాయి.

 చికాకులూ తప్పుతాయ్..
 హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారిలో 60-70 శాతం మంది ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలు, వ్యాపారులుంటారు. వీరిలో 50-60 శాతం మంది ప్రాపర్టీలను కొనేముందు రియల్టీ పోర్టల్స్‌లో ఆయా ప్రాజెక్ట్ వివరాలు, అక్కడి ప్రాంత అభివృద్ధి తదితర అంశాలను  తెలుసుకుంటారు. ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాక ఫ్లాట్ కొందామని ఏదైనా బిల్డర్‌ను కలుద్దామంటే కొనుగోలుదారుల్లో భయం నెలకొంటోంది. ఎందుకంటే తమ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్ తీసుకొని ఫ్లాట్ కొనే వరకూ వేధిస్తుంటారు. ఫోన్లు చేసి విసిగిస్తుంటారు కూడా. అయితే ఇప్పుడా చికాకులేవీ లేకుండా నేరుగా రీడైల్ రియల్టీ పోర్టల్‌లోనే ఫ్లాట్ బుక్ చేసుకునే వీలుండటంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘రీడైల్’ సేవలు!
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఇప్పటివరకు హైదరాబాద్‌లో మాత్రమే ‘రీడైల్’ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి జిల్లాల్లోని అద్దె, సొంతిల్లు, ప్రాజెక్ట్‌లు, వెంచర్ల వివరాలు రీడైల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని’’ రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ వెంకటరమణ చెప్పారు. శుక్రవారమిక్కడ సంస్థ తొలి వార్షికోత్సవం సందర్భంగా 1800 274 2224 అనే  టోల్ ఫ్రీ నంబర్‌ను విడుదల చే శారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది రీడైల్‌కు 25 వేల మంది కాలర్స్ ఫోన్ చేశారని, 40 వేలకు పైగా ప్రాపర్టీ వివరాలను కొనుగోలుదారులకు అందించామన్నారు. హైదరాబాద్‌లోని సుమారు 400 ప్రాజెక్ట్‌లు, 14 వేలకు పైగా ప్రాపర్టీలు తమ సంస్థలో రిజిస్టర్ అయి ఉన్నాయని ఆయన వివరించారు. ఇకపై రీడైల్ వెబ్‌సైట్‌లో గృహ రుణాలకు సంబంధించిన వివరాలూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement