సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఫ్లెక్సీ రేట్ల విధానంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లెక్సీ రేట్ల విధానానికి గుడ్ బై చెప్పాలని రైల్వే శాఖనిర్ణయించింది. డైనమింక్ ప్రైసింగ్ పేరుతో ప్రస్తుతం 142 రైళ్ళలో అమల్లో ఉన్న ఫ్లెక్సీ ఫేర్స్ పాలసీని కొన్ని రైళ్లలో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులపై ఛార్జీల భారంతోపాటు, ఈ విధానం ద్వారా డిమాండ్ బాగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
డైనమిక్ ప్రైసింగ్ పేరుతో అమలవుతున్న ఈపద్ధతిలో ఆశించిన ప్రయోజనం దక్కకపోగా ప్రీమియం రైళ్లలో డిమాండ్‌భారీగా క్షీణిస్తోంది. ముఖ్యంగా చార్జీలు విమాన టికెట్లను మించిపోవడంతో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. దీంతో 40 రైళ్ళలో ఈ ఫ్లెక్సీ విధానాన్ని ఎత్తివేయనుంది. అయితే మిగిలిన 102 రైళ్ళలో ఫెక్లీ ఫేర్స్ అమలు కానున్నాయి. ప్రయాణానికి నాలుగు రోజులు ముందు, చివరి నిమిషంలో బుకింగ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. దీంతోపాటు 60శాతం కంటే తక్కువ బుకింగ్స్ ఉన్న రైలు టికెట్లపై గ్రేడెడ్ డిస్కౌంట్ కూడా ఉందని రైల్వే శాఖ వెల్లడించింది.
ప్రయాణీకులను ఆకర్షించడంపై సాధించడంపై తాము దృష్టి కేంద్రీకరించామనీ, సరసమైన ధరల్లో రైల్వే ప్రయాణాన్ని తిరిగి వారికి అందుబాటులోకి తేవాలని భావించామని సీనియర్ రైల్వే అధికారి చెప్పారు. వినియోగదారుపై భారం మోపడం ద్వారా కాకుండా, సీట్ల అధిక వినియోగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నామన్నారు. ఈ కొత్త విధానం సంబంధిత ప్రభుత్వ అధికారుల తుది ఆమోదం అనంతరం అమల్లోకి రానుందని చెప్పారు.
కాగా 44 రాజధాని, 46 శతాబ్ది, 52 దురంతో రైళ్ళలో ప్రస్తుతం డైనిమిక్ ప్రైసింగ్ విధానం అమల్లో ఉంది. దురంతో రైళ్ళలో ఏసీతో పాటు నాన్ ఏసీ బెర్త్ లు కూడా ఉంటాయి.. మిగిలిన రైళ్ళలో అన్నీ ఏసీ బోగీలే. ధరలు భారీగా పెరగడంతో ప్రయాణీకులు, డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు రేట్లతో ఆకట్టుకుంటున్న విమాన ప్రయాణాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆలస్యంగా కళ్ళు తెరిచిన రైల్వేశాఖ ఈ కొత్త విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.
Comments
Please login to add a commentAdd a comment