న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్‌లపై బరువైన వస్తువులు, సిలిండర్లు పెట్టి, రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వేశాఖ చెక్ పెట్టనుంది. ఇటువంటి దుశ్చర్యలను విఫలం చేసేందుకు రైల్వేశాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది.
రైలు ప్రమాద కుట్రలను పసిగట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ (ఇంజిన్) ముందు, గార్డు క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలు అమర్చనున్నారు. దీంతో లోకోమోటివ్ పైలట్‌లు ట్రాక్‌పై అడ్డుగావున్న వస్తువును దూరం నుండే చూడగలుగుతారు. ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి. ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది.
ఇటీవలి కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై భారీ వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాలను రైళ్లకు అమర్చాలని నిర్ణయించారు. ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు పంపారు. బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది. మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే, రైళ్లకు స్పీడ్ విజన్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది.
ఇది కూడా చదవండి: ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment