ఆహార ధరలు తగ్గాయ్
ఐరాస ఎఫ్‌ఏఓ వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆహారోత్పత్తుల ధరలు మేలో 3.2 శాతం తగ్గాయి. ఇలా ఆహారధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల అని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆహారం, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్‌ఏఓ) తెలిపింది. పాల ఉత్పత్తులు, ధాన్యాలు, వంట నూనెల ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించడమే ధరల తగ్గుదలకు కారణమని పేర్కొంది. ఎఫ్‌ఏఓ వెల్లడించిన వివరాల ప్రకారం..,
గత ఏడాది మేలో 214.6 పాయింట్లుగా ఉన్న ఎఫ్‌ఏఓ ప్రైస్ ఇండెక్స్ ఈ ఏడాది మేలో 3.2 శాతం క్షీణించి 207.8 పాయింట్లకు తగ్గింది. ఈ ప్రైస్ ఇండెక్స్‌లో ధాన్యాలు, చమురు విత్తనాలు, పాల ఉత్పత్తులు, మాంసం, పంచదార తదితర ఆహార ఉత్పత్తుల ధరలను కలిపి లెక్కిస్తారు.సాగు పరిస్థితులు సవ్యంగా ఉండడం, మంచి దిగుబడి వస్తుందనే అంచనాలతో మొక్కజొన్న ధరలు క్షీణించడంతో ఆహార ధాన్యాల ధరల సూచీ 13 శాతం తగ్గింది.బియ్యం ధరలు స్వల్పంగా తగ్గాయి. గోధుమ ధరలు ప్రారంభంలో పెరిగినా, రెండు వారాల తర్వాత తగ్గాయి.
ఎల్‌నినో కారణంగా ఉత్పత్తి తగ్గుతుందనే అంచనాలతో మే నెల ప్రారంభంలో పంచదార ధరలు పెరిగాయి. అయితే భారత్, థాయ్‌లాండ్‌ల్లో భారీ చక్కెర నిల్వలు చోటు చేసుకుంటాయనే సంకేతాల కారణంగా మూడో వారం నుంచి ధరలు తగ్గాయి.ఆగ్నేయాసియాలో పామాయిల్ ఉత్పత్తి పెరగడం, దక్షిణ అమెరికాలో సోయాబీన్ క్రషింగ్ అధికంగా ఉండడం, ప్రపంచవ్యాప్తంగా సోయాబీన్ దిగుబడులు ఆశావహంగా ఉంటాయన్న అంచనాలతో వంటనూనెల ధరల సూచీ వరుసగా రెండో నెల కూడా క్షీణించింది.కాగా మాంసం ధరల సూచీ మాత్రం ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి మార్పులకు గురి కాలేదు.