పంటలను పరిశీలిస్తున్న అంతర్జాతీయ కూరగాయల పరిశోధన సంస్థ డీజీ మార్కో వోపెరీస్
రామచంద్రాపురం (పటాన్‌చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్‌లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు.
ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్‌లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment