daily
-
ఫోన్‌పేలో ‘పసిడి’ పొదుపు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) 'డైలీ సేవింగ్స్' పేరుతో కొత్త ఉత్పత్తిని పరిచయం చేయనుంది. ఇందుకోసం మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ ‘జార్’తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది యూజర్లు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కొత్త ఉత్పత్తి కింద వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో రోజుకు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్థిరమైన పొదుపును అలవరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను కేవలం 45 సెకన్లలోపు క్రమబద్ధీకరించే జార్ ఇంటిగ్రేటెడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్‌ను ఫోన్‌పే 'డైలీ సేవింగ్స్' ఫీచర్‌కు జోడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇటీవలి కాలంలో తమ ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారంపై యూజర్ల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదలను చూసినట్లు ఇన్‌యాప్ కేటగిరీస్, కన్స్యూమర్ పేమెంట్స్ హెడ్ నిహారిక సైగల్ చెప్పారు. ఇటీవల సూక్ష్మమైన, సురక్షితమైన డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్లకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు ఫోన్‌పే సైతం గుర్తించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 560 మిలియన్ల మందికి పైగా ఫోన్‌పే యూజర్లకు డిజిటల్ గోల్డ్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. -
పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
కూరగాయలే ఎక్కువగా తినాలి
రామచంద్రాపురం (పటాన్చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్‌లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..!
భారతీయ రైల్వే ప్రతీరోజూ సుమారు 8 వేల రైల్వే స్టేషన్ల మీదుగా రైళ్లను నడుపుతుంది. వాటిలో కొన్ని రైళ్లు సుదీర్ఘ ప్రయాణం సాగిస్తాయి. ఇప్పుడు మనం దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ఐదు రైళ్ల గురించి తెలుసుకుందాం. వివేక్ ఎక్స్‌ప్రెస్(డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి): ఇది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రత్యేక సిరీస్ కలిగినది. ఇది 4 వేర్వేరు రూట్లలో ప్రయాణం సాగిస్తుంది. ఈ రైలు డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ ఏకంగా 4,273 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పూర్తి ప్రయాణం 80 గంటల 15 నిముషాలు ఉంటుంది.9 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించే రైలుకు మొత్తం 55 స్టాపులు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్- సిల్చర్ ఎక్స్‌ప్రెస్: ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరువనంతపురం సెంట్రల్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది గువాహటి వరకూ ప్రయాణం సాగిస్తుంది. దీనిని 2017 నవంబరు 21న సిల్చర్ వరకూ పొడిగించారు. ఇది భారతదేశంలో అత్యంత దూర ప్రయాణం సాగించే రెండవ రైలు. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్(జమ్ము తావి నుంచి కన్యాకుమారి): ఇది వారాంతపు ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కొలువైన జమ్ము వరకూ ప్రయాణిస్తుంది. దేశంలో సుదీర్ఘ ప్రయాణం సాగించే రైళ్లలో ఇది మూడవది. 12 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైలుకు 73 స్టాపులు ఉన్నాయి. టెన్ జమ్ము ఎక్స్‌ప్రెస్(తిరునెల్వేలి జమ్ము): తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సుమారు 3,631 కిలోమీటర్ల దూరం వరకూ ఈ రైలు ప్రయాణం సాగించి జమ్ముకశ్మీర్‌లోని కట్రాకు చేరుకుంటుంది. మొత్తం 523 స్టేషన్లు కలిగిన ఈ మార్గంలో 62 స్టేషనల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.ఈ రైలు 71 గంటల 20 నిముషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. నవయుగ్ ఎక్స్‌ప్రెస్(మంగళూరు నుంచి జమ్ము) ఇది వారాంతపు రైలు. జమ్ము తావి నుంచి మంగళూరు సెంట్రల్ వరకూ నడుస్తుంది. ఈ రైలు 3607 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 61 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలు 68 గంటల పాటు తన ప్రయాణాన్ని సాగించి, గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది కూడా చదవండి: ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే.. -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్‌లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్‌బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
సూక్ష్మ మొక్కలతో వ్యాధుల నివారణ!
సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్)ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా నివారించుకోవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మ మొక్కలను ట్రేలలో ఇంట్లోనే పెంచుకునే పద్ధతులను గురించి వ్యాసం మొదటి భాగంలో గత వారం తెలుసుకున్నాం, ఇది చివరి భాగం. హృదయ సంబంధ వ్యాధులు: ఈ చిన్నమొక్కలు అత్యధికంగా పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన గుండెని కాపాడతాయి. అల్జీమర్స్/మతిమరుపు:వీటిలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల ఆరోగ్యాన్ని పనితీరును కాపాడి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును నియంత్రిస్తాయి. మధుమేహం: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉండటం వలన శరీర కణాలు చక్కెరను సరిగ్గా వినియోగించుకునే ప్రక్రియను నియంత్రిస్తాయి. ప్రత్యేకంగా మెంతులు ఇలా ఉపయోగించినప్పుడు మధుమేహాన్ని నియంత్రించినట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైనది. కాన్సర్: వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల కేన్సర్లను నియంత్రిస్తాయి. ఏ పంటలో ఏయే పోషకాలు? 1. ముల్లంగి: ముల్లంగి విత్తనాలను కూడా సూక్ష్మవిత్తనాలుగా వాడుకోవచ్చు. ఇవి ఉష్ణ, శీతల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొలకెత్తుతాయి. అంతేగాక ఇవి అతి తొందరగా ఎదగడం వల్ల 5 నుంచి 10 రోజులలో కత్తిరించి వాడుకోవచ్చు. 2.బ్రోకలీ: బ్రోకలీని శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు. దీనిలో ఖనిజాలు ముఖ్యంగా ఇనుము, ఎ–సి విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. ఎదిగిన బ్రోకలీ మొక్కల కంటే వీటిలో అత్యధికంగా పోషకాలు ఉంటాయి. 3.బీట్రూట్: మిగతా విత్తనాలతో పోలిస్తే బీట్రూట్ విత్తనాలను మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. సాధారణంగా 6 నుంచి 8 రోజులలో మొలకెత్తుతాయి. 10–12 రోజుల్లో కత్తిరించుకోవచ్చు. బీట్రూట్ విత్తనాలను వేసుకునే ముందు చల్లని నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఈ సూక్ష్మ విత్తనాలు ఆహారానికి పోషకాలతోపాటు రంగును కూడా చేరుస్తాయి. 4. తోటకూర: తోటకూర విత్తనాలు తొందరగా మొలకలు వచ్చి అతి త్వరగా ఎదుగుతాయి. దాదాపుగా 2 లేదా 3 రోజుల వ్యవధిలో మొలకెత్తుతాయి. 8 లేదా 12 రోజులలో కోతకు వస్తుంది. వీటిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. 5.ఆవాలు : ఆవాలు 3 నుంచి 4 రోజుల్లో మొలకెత్తుతాయి. 6 నుంచి 10 రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. ఇవి చాలా తొందరగా ఎదుగుతాయి. వీటి ఘాటు రుచి వలన వంటకాలలో లేదా సలాడ్‌లో చేర్చినప్పుడు మంచి రుచిని ఇస్తాయి. 6. చుక్కకూర: చుక్కకూర విత్తనాలు 4 నుంచి 5 రోజులలో మొలకెత్తుతాయి. ఇవి నెమ్మదిగా ఎదుగుతాయి. కాబట్టి 12 నుంచి 20 రోజుల సమయం తీసుకుంటాయి. వీటిని వంటకాలలో చేర్చినప్పుడు పులుపు రుచిని కలిగి ఉండటం వలన ఎక్కువగా ఇష్టపడతారు. కంపోస్టులో పెరిగిన సూక్ష్మ మొక్కల్లో అధిక పోషకాలు! ► కంపోస్టు, హైడ్రోపోనిక్ (పోషకాల ద్రావణం కలిపిన నీరు లేదా నీరు మాత్రమే) మాధ్యమాలను సరి పోల్చినప్పుడు.. కంపోస్టులో పెంచిన మొక్కలలో అధిక పోషకాలు ఉన్నట్లు నిర్థారితమైంది. ► అమెరికా శాస్త్రవేత్తలు బ్రోకలీ మైక్రోగ్రీన్స్‌ని, ఎదిగిన బ్రోకలీ మొక్కలలోని మినరల్స్‌తో పోల్చి చూసినప్పుడు 1.15 నుంచి 2.32 శాతం వరకు (ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, సోడియం, జింక్ వంటి) ఖనిజాలు మైక్రోగ్రీన్స్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ► ఈ మైక్రోగ్రీన్స్ పెంచడానికి కేవలం ఎకరానికి 15,679 లీటర్ల నీరు మాత్రమే అవసరం. అదే మొక్కలను పూర్తిగా పెంచినట్లయితే 24,80,000 నుంచి 37,00,000 లీటర్ల నీరు అవసరం. అదేవిధంగా బ్రోకలీ మొక్కలు పూర్తిగా ఎదగడానికి 100 నుంచి 150 రోజుల సమయం పడుతుంది. కానీ మైక్రోగ్రీన్స్‌ని 7 నుంచి 9 రోజులలో కత్తిరించుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే తరిగిపోతున్న వనరులు, గ్లోబల్ వార్మింగ్, పోషకాహార లోపం వంటి సమస్యలను కూడా ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా నివారించవచ్చు. ► 25 రకాల మైక్రోగ్రీన్స్‌పై జరిపిన పరిశోధనలో 100 గ్రాములలో 20.4 నుంచి 147.0 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 6 నుంచి 12.1 మి.గ్రా.ల బీటా కెరోటిన్, 4.9 నుంచి 87.4 విటమిన్ ఇ ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి బాగా పెరిగిన ఆకులతో పోల్చితే చాలా ఎక్కువ శాతం పోషకాలను కలిగి ఉన్నాయి. ఈ 25 రకాలలో రెడ్ క్యాబేజి, కొత్తిమీర, తోటకూర, ముల్లంగిలో అత్యధికంగా ఆస్కార్బిక్ ఆమ్లం, కెరోటినాయిడ్స్, ఫిల్లిక్వినోన్లు, టోకోఫెరాన్లు ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారు. ► చక్కెర శాతం కూడా ప్రతి వంద గ్రాములలో 10.3 గ్రా. ఉండగా అదే పరిపక్వత చెందిన వాటిలో 44–17 గ్రా. ఉన్నట్లు గుర్తించారు. ► రెడ్ క్యాబేజీపై జరిపిన పరిశోధనలో మైక్రోగ్రీన్లో ప్రతి గ్రాముకు 71.01 మైక్రోమోల్స్ ఫాలీఫినాల్స్ ఉండగా, పరిపక్వత చెందిన రెడ్ క్యాబేజీలో 50.58 మైక్రోమోల్స్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడే వారికి ఫాలీఫీనాల్స్ ఉపయోగకరం. ► హైడ్రోపోనిక్‌లో పొటాషియం తక్కువగా ఉన్న పోషకాల ద్రావణం కలపడం ద్వారా ఈ మాధ్యమంలో పెంచిన మైక్రోగ్రీన్స్‌లో తక్కువ పొటాషియం కలిగి మిగతా పోషకాలలో మార్పు లేక పోవటం వలన కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ మైక్రోగ్రీన్స్ సహాయ పడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. సూక్ష్మ మొక్కలతో ఎన్నెన్నో వంటకాలు సూక్ష్మమొక్కలను సాధారణంగా సలాడ్, సాండ్విచ్, పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లలో వాడతారు. అంతేకాకుండా సూపులు, రోల్స్‌లో కూడా చేర్చడం ద్వారా రుచితోపాటు పోషకాలు కూడా అధికంగా అందుతాయి. సూక్ష్మమొక్కల ఉపయోగాన్ని మరింత సులభం చేయడానికి హైదరాబాద్‌లోని ‘మేనేజ్’, జాతీయ పోషకాహార సంస్థ కలిసి వివిధ ఆహార పదార్థాలలో ఈ మొక్కలను చేర్చి పోషక స్థాయిని అధ్యయనం చేస్తున్నారు. ఇంత ఆవశ్యకత కలిగిన ఈ సూక్ష్మ మొక్కలను హోటళ్లు, రెస్టారెంట్లలో అధిక ధర పెట్టి కొనుక్కోవటం కాకుండా సులభంగా ఇంట్లోనే పెంచుకోవడం ద్వారా రోజూ తినే ఆహారంలో రుచిని, పోషకాలను పెంచుకొని ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. – డా. వినీత కుమారి (83672 87287), డెప్యూటీ డైరెక్టర్ (జెండర్ స్టడీస్), డా. జునూతుల శిరీష, సీనియర్ రీసెర్చ్ ఫెలో, డా. మేకల శ్రీకాంత్, కన్సల్టెంట్, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్), హైదరాబాద్ వాడకానికి సిద్ధమైన ఆవాల సూక్ష్మ మొక్కలు నీటిలో పెరిగిన తెల్ల ముల్లంగి సూక్ష్మ మొక్కలు -
స్పాట్ బెడతా!
పోలీస్ సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు ఇప్పటికీ ప్రస్తావనకొచ్చే సినిమా. లాఠీకి పదునైన పనిచెప్పిన సినిమా. ఖాకీ పౌరుషాన్ని కళ్లకు కట్టిన సినిమాలోని దృశ్యాలు ఇవి.... సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘సార్... వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కళ్లద్దాల రిపోర్టర్.‘‘సర్లేగాని అడుగు’’ అన్నారు సీయం క్యాజ్వల్గా.ఈలోపు ఇద్దరి మధ్య ఫొటోగ్రాఫర్ దూరి...‘‘కొంచెం నవ్వండి సార్’’ అన్నాడు.‘‘మధ్యలో నీ గొడవేంది. కాస్త అవతలుండు’’ అని విసుక్కున్నారు సీయం.రిపోర్టర్ ప్రశ్న అందుకున్నాడు...‘‘ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అవ్వక ముందు అయిన తరువాత మీ అనుభవాలు చెబుతారా?’’‘‘జరిగిపోయినదాని గురించి ఇప్పుడెందుకయ్యా. జరగాల్సిన దాని గురించి ఏమైన అడగదల్చుకుంటే అడుగు’’ అన్నారు సీయం.‘‘సార్... మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట?’’ అడిగాడు రిపోర్టర్.పక్కలో ఫుల్‌బాటిల్ పడ్డట్టు అదిరిపడ్డారు హోంమినిస్టర్గారు. అంతలోనే సర్దుకుని...‘‘అబ్బబ్బే...అలాంటిదేమీ లేదండీ.ఆలోచనలో ఉంది. సీయంగారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు’’ అని బుకాయిస్తూ ‘‘అనవసరంగా పేపర్లో రాయొద్దు’’ అన్నారు హోంమంత్రి.మంత్రిగారి మాటలకు సీయంగారికి చిర్రెత్తుకొచ్చింది.‘‘నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా. తీసిపారేయ్యడం ఖాయం’’ గట్టిగా చెప్పారు సీయం.‘‘కారణం చెబుతారా?’’ అడిగాడు రిపోర్టర్.‘‘చూడూ... నువ్వు తాగుతావా?’’ సూటిగా అడిగారు సీయం.సిగ్గుతో మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘ఫరవాలేదు చెప్పు’’ అన్నారు సీయం.‘‘అప్పుడప్పుడూ సార్’’ మరింతగా సిగ్గుపడ్డాడు రిపోర్టర్.‘‘అయితే తాగెల్లి నీ పెళ్లాన్ని అడుగు చెబ్బుద్ది’’ అన్నారు సీయం.‘మీరు భలే కామెడీ మాట్లాడతారు సార్’’ మూడోసారి మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘కడుపు మండినప్పుడు వచ్చేది కామెడియే లేవయ్యా’’ జీవితసత్యాన్ని చెప్పారు సీయం.మరో ప్రశ్న అందుకున్నాడు రిపోర్టర్...‘‘మీరు ఎన్నికలలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చగలనని అనుకుంటున్నారా?’’హోంమంత్రికి మళ్లీ కోపం వచ్చింది.‘‘ఏమిటండీ అది...ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెబుతాం. చెప్పాంగదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదో కాస్త ఆలోచించి అడగాలి’’ విసుక్కున్నారు హోంమంత్రి.సీయంగారు హోంమంత్రి వైపు గుర్రుగా చూశారు. ఆపై ఇలా అన్నారు...‘‘కృష్ణారావు! నీకు అపశకునాలు పలకడం అలవాటైపోయింది. ఇదిగో వికాసు...నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదల్చుకోలేదు’’రిపోర్టర్‌తో మాట్లాడిన తరువాత సీయంగారు బయటికి వచ్చారు. భారీ బందోబస్త్! ఎటు చూసినా పోలీసులు! ఆశ్చర్యంతో అదిరిపడ్డారు సీయం.‘‘ఏంది? ఏందయ్యా ఇదంతా?’’ కారు డోరు తీస్తూ విసుక్కున్నారు సీయం.‘‘మీకు సెక్యూరిటీ సార్’’ గొప్పగా అన్నారు హోంమంత్రి.‘‘ఒక్క మనిషికి ఏందయ్యా ఇంత హడావిడి. నాకు ఈ కారు చాలు. ఇంకేం బడ్లా’’ అన్నారు సీయం.‘‘మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దనడం బాలేదు. చీఫ్ మినిస్టర్‌గా రేపొద్దున మీకేమైనా జరిగితే హోంమినిస్టర్‌గా తట్టుకోలేను’’ అర్జెంటుగా ఆందోళనను కళ్లలోకి తెచ్చుకున్నారు హోంమినిస్టర్.‘‘ఇదిగో హోము. ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలిగాని ప్రజల డబ్బుతో మనకెందుకయ్యాసెక్యూరిటీ?’’ నిలదీశారు సీయం.‘‘సార్! మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ’’ అన్నాడు పెద్దపోలీసాయన.‘‘సరే...మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులను పెట్టుకోండి. నా ముందుగానీ వెనగ్గాని మీరెవరు రాబల్లే. బయలుదేరండి’’ అన్నారు సీయం. కారు ఎక్కబోయే ముందు ‘‘రత్తమ్మా...ఏది కాస్త ఎదురు రా’’ అని పిలిచారు.నిండు ముల్తైదువు సీయంగారి కారుకు ఎదురొచ్చింది.ముందు సీట్లో హోంమంత్రి కూర్చోబోతుంటే...‘‘ఇదిగో కృష్ణారావు! అట్టా ఇరుక్కొని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది. వెనక్కి రా కబుర్లు చెప్పుకుందాం’’ అన్నారు సీయం.‘‘ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు’’ నవ్వుతూ వెనకసీట్లో సీయం పక్కన కూర్చొన్నారు హోంమంత్రి. కారు కదిలింది. ‘‘చిరునవ్వుతో ఎదురొచ్చే ముల్తైదువు కంటే సెక్యూరిటీ ఏం ఉంటుంది!’’ అన్నారు సీయం. జీబు దిగి ఆ పోలీస్‌స్టేషన్‌లోకి రాజసంగా నడిచొచ్చాడు రౌడీషీటర్ నీలకంఠం. ‘‘నమస్తే బై. నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్‌కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను కలవాల్సిందే. నువ్వు కల్వలేదు. నేను బాధపడను. నేను ఏ మూమెంట్ చేసినా, ఏ స్పాట్పెట్టినా ముందుగా చెప్పేది పోలీసోళ్లకే’’తనను తాను పరిచయం చేసుకుంటూనే తనతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో చెప్పకనే చెప్పాడు నీలకంఠం.ఆ తరువాత ‘సంటీ’ అని పిలిచాడు. తమ్ముడు సంటి జర్దా నములకుంటూ నడుముకు కట్టుకున్న కాశీ తువ్వాలును విప్పాడు. అందులోని డబ్బుల కట్టలను టేబుల్‌పై వేశాడు. కుక్కకు బిస్కెట్ వేసినట్లుగా, తీసుకోమన్నట్లుగా తల ఊపాడు నీలకంఠం.‘‘ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్. వీక్లియా? మంత్లీయా? మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తాం. మన స్పాట్ మీద స్టేట్పాలిటిక్స్ నడుస్తుంది’’ ఇలా ఏవేవో మాట్లాడుతున్నాడునీలకంఠం.అటు నుంచి మాత్రం సౌండు లేదు. స్పందన లేదు.‘‘మాట్లాడు’’ అన్నాడు నీలకంఠం.నీలకంఠాన్ని కోపంగా ఒక్క తోపు తోసి...‘‘పోలీస్‌స్టేషన్ అంటే సారాబట్టీ అనుకున్నావా? ఊచల్లో పెట్టి వెన్నుపూసలు వంచడానికి వచ్చాను. మైండిట్ రాస్కెల్’’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్. -
రోగి సహాయకులకు రోజు కూలీ చెల్లింపు
ఐటీడీఏ పీఓ చక్రధర్‌బాబు వెల్లడి వీఆర్‌పురం: కాళ్లవాపు వ్యాధి బారినపడి చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే రోగికి సహాయకుల్లో ఒకరికి రోజు కూలీ కట్టి, ఎన్ని రోజులుంటే అన్ని రోజులూ చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం నుంచి ఈ వ్యాధిపై ఇంటింట సర్వే చేపట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం మూలంగా ఎవరైనా ఈ వ్యాధి బారిన పడినట్లైతే ఆ రోగికి సహాయకులుగా వెళ్లేందుకు బంధువులు వెనుకాడకుండా ఉండేందుకే సహాయకుడికి రోజు కూలి చెంల్లించేలా ప్రణాళిక చేశామన్నారు. ఈ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో నిపుణులైన వైద్యుడితో ప్రత్యేక వైద్య శిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ పవన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యాల కుసుమాంబ, సివిల్ సర్జన్ ఎ.రామారావు, ఎంపీడీఓ జి.సరోవర్, హాస్పటల్ కమిటీ చైర్మెన్ వి.గాంధీబాబు, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎం.దుర్గాప్రసాద్, ప్రదీప్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చాక్లెట్ తింటే మధుమేహం దూరం!
లండన్ః రోజూ వంద గ్రాముల చాక్లెట్ తిని మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు తాజా అధ్యయనకారులు. త్వరలో డాక్టర్లు కూడ ఇదో వైద్యంగా సలహా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా ముధుమేహాన్ని నియంత్రించ వచ్చని లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. చాక్లెట్ లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తాయని తద్వారా గుండె జబ్బులు కూడ వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు. వార్విక్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు 18 నుంచి 69 ఏళ్ళ మధ్య వయసుగల 1153 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో తాజా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చక్కెర వ్యాధి గ్రస్థులు ప్రతిరోజూ వంద గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణకు సహకరించడంతోపాటు ఇతర హృద్రోగ సమస్యలు కూడ చాలావరకూ తగ్గే అవకాశం ఉందని లక్సెంబర్గ్ పరిశోధనల్లో తెలుసుకున్నారు. డార్క్ చాక్లెట్ తయారీకి వినియోగించే కోకోలో మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రతిరోజూ 100 గ్రాముల చాక్లెట్ ను తీసుకోవడం వల్ల లివర్ లోని ఎంజైములు అభివృద్ధి చెంది, ఇన్సులిన్ ను నియంత్రించేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఈ చాక్లెట్ ను ప్రతిరోజూ తీసుకునేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, రోజుకు 28.8 గ్రాముల చొప్పున ప్రతిరోజూ తీసుకునే వారిలో చురుకుదనం పెరిగి ఉత్సాహంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలినట్లు చెప్తున్నారు. అంతేకాక కోకో ఉన్న ఉత్పత్తులను తరచుగా తీసుకోవడం వల్ల కూడ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని, ఇది గుండె మెటబాలిక్ కండిషన్ ను మెరుగు పరుస్తుందని వార్విక్ మెడికల్ స్కూల్ పరిశోధకుల సెవేరియో స్టేంజెస్ తెలిపారు. పరిశోధనా వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు.