చాక్లెట్ తింటే మధుమేహం దూరం!
లండన్ః రోజూ వంద గ్రాముల చాక్లెట్ తిని మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు తాజా అధ్యయనకారులు. త్వరలో డాక్టర్లు కూడ ఇదో వైద్యంగా సలహా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా ముధుమేహాన్ని నియంత్రించ వచ్చని లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. చాక్లెట్ లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తాయని తద్వారా గుండె జబ్బులు కూడ వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు.
వార్విక్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు 18 నుంచి 69 ఏళ్ళ మధ్య వయసుగల 1153 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో తాజా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చక్కెర వ్యాధి గ్రస్థులు ప్రతిరోజూ వంద గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణకు సహకరించడంతోపాటు ఇతర హృద్రోగ సమస్యలు కూడ చాలావరకూ తగ్గే అవకాశం ఉందని లక్సెంబర్గ్ పరిశోధనల్లో తెలుసుకున్నారు. డార్క్ చాక్లెట్ తయారీకి వినియోగించే కోకోలో మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ప్రతిరోజూ 100 గ్రాముల చాక్లెట్ ను తీసుకోవడం వల్ల లివర్ లోని ఎంజైములు అభివృద్ధి చెంది, ఇన్సులిన్ ను నియంత్రించేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఈ చాక్లెట్ ను ప్రతిరోజూ తీసుకునేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, రోజుకు 28.8 గ్రాముల చొప్పున ప్రతిరోజూ తీసుకునే వారిలో చురుకుదనం పెరిగి ఉత్సాహంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలినట్లు చెప్తున్నారు. అంతేకాక కోకో ఉన్న ఉత్పత్తులను తరచుగా తీసుకోవడం వల్ల కూడ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని, ఇది గుండె మెటబాలిక్ కండిషన్ ను మెరుగు పరుస్తుందని వార్విక్ మెడికల్ స్కూల్ పరిశోధకుల సెవేరియో స్టేంజెస్ తెలిపారు. పరిశోధనా వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు.