పోలీస్ సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు ఇప్పటికీ ప్రస్తావనకొచ్చే సినిమా. లాఠీకి పదునైన పనిచెప్పిన సినిమా. ఖాకీ పౌరుషాన్ని కళ్లకు కట్టిన సినిమాలోని దృశ్యాలు ఇవి.... సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘సార్... వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కళ్లద్దాల రిపోర్టర్.‘‘సర్లేగాని అడుగు’’ అన్నారు సీయం క్యాజ్‌వల్‌గా.ఈలోపు ఇద్దరి మధ్య ఫొటోగ్రాఫర్ దూరి...‘‘కొంచెం నవ్వండి సార్’’ అన్నాడు.‘‘మధ్యలో నీ గొడవేంది. కాస్త అవతలుండు’’ అని విసుక్కున్నారు సీయం.రిపోర్టర్ ప్రశ్న అందుకున్నాడు...‘‘ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అవ్వక ముందు అయిన తరువాత మీ అనుభవాలు చెబుతారా?’’‘‘జరిగిపోయినదాని గురించి ఇప్పుడెందుకయ్యా. జరగాల్సిన దాని గురించి ఏమైన అడగదల్చుకుంటే అడుగు’’ అన్నారు సీయం.‘‘సార్... మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట?’’ అడిగాడు రిపోర్టర్.పక్కలో ఫుల్‌బాటిల్ పడ్డట్టు అదిరిపడ్డారు హోంమినిస్టర్‌గారు. అంతలోనే సర్దుకుని...‘‘అబ్బబ్బే...అలాంటిదేమీ లేదండీ.ఆలోచనలో ఉంది. సీయంగారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు’’ అని బుకాయిస్తూ ‘‘అనవసరంగా పేపర్లో రాయొద్దు’’ అన్నారు హోంమంత్రి.మంత్రిగారి మాటలకు సీయంగారికి చిర్రెత్తుకొచ్చింది.‘‘నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా. తీసిపారేయ్యడం ఖాయం’’ గట్టిగా చెప్పారు సీయం.‘‘కారణం చెబుతారా?’’ అడిగాడు రిపోర్టర్.‘‘చూడూ... నువ్వు తాగుతావా?’’ సూటిగా అడిగారు సీయం.సిగ్గుతో మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘ఫరవాలేదు చెప్పు’’ అన్నారు సీయం.‘‘అప్పుడప్పుడూ సార్’’ మరింతగా సిగ్గుపడ్డాడు రిపోర్టర్.‘‘అయితే తాగెల్లి నీ పెళ్లాన్ని అడుగు చెబ్బుద్ది’’ అన్నారు సీయం.‘మీరు భలే కామెడీ మాట్లాడతారు సార్’’ మూడోసారి మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘కడుపు మండినప్పుడు వచ్చేది కామెడియే లేవయ్యా’’ జీవితసత్యాన్ని చెప్పారు సీయం.మరో ప్రశ్న అందుకున్నాడు రిపోర్టర్...‘‘మీరు ఎన్నికలలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చగలనని అనుకుంటున్నారా?’’హోంమంత్రికి మళ్లీ కోపం వచ్చింది.‘‘ఏమిటండీ అది...ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెబుతాం. చెప్పాంగదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదో కాస్త ఆలోచించి అడగాలి’’ విసుక్కున్నారు హోంమంత్రి.సీయంగారు హోంమంత్రి వైపు గుర్రుగా చూశారు. ఆపై ఇలా అన్నారు...‘‘కృష్ణారావు! నీకు అపశకునాలు పలకడం అలవాటైపోయింది. ఇదిగో వికాసు...నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదల్చుకోలేదు’’రిపోర్టర్‌తో మాట్లాడిన తరువాత సీయంగారు బయటికి వచ్చారు.
భారీ బందోబస్త్! ఎటు చూసినా పోలీసులు! ఆశ్చర్యంతో అదిరిపడ్డారు సీయం.‘‘ఏంది? ఏందయ్యా ఇదంతా?’’ కారు డోరు తీస్తూ విసుక్కున్నారు సీయం.‘‘మీకు సెక్యూరిటీ సార్’’ గొప్పగా అన్నారు హోంమంత్రి.‘‘ఒక్క మనిషికి ఏందయ్యా ఇంత హడావిడి. నాకు ఈ కారు చాలు. ఇంకేం బడ్లా’’ అన్నారు సీయం.‘‘మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దనడం బాలేదు. చీఫ్ మినిస్టర్‌గా రేపొద్దున మీకేమైనా జరిగితే హోంమినిస్టర్‌గా తట్టుకోలేను’’ అర్జెంటుగా ఆందోళనను కళ్లలోకి తెచ్చుకున్నారు హోంమినిస్టర్.‘‘ఇదిగో హోము. ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలిగాని ప్రజల డబ్బుతో మనకెందుకయ్యాసెక్యూరిటీ?’’ నిలదీశారు సీయం.‘‘సార్! మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ’’ అన్నాడు పెద్దపోలీసాయన.‘‘సరే...మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులను పెట్టుకోండి. నా ముందుగానీ వెనగ్గాని మీరెవరు రాబల్లే. బయలుదేరండి’’ అన్నారు సీయం. కారు ఎక్కబోయే ముందు ‘‘రత్తమ్మా...ఏది కాస్త ఎదురు రా’’ అని పిలిచారు.నిండు ముల్తైదువు సీయంగారి కారుకు ఎదురొచ్చింది.ముందు సీట్లో హోంమంత్రి కూర్చోబోతుంటే...‘‘ఇదిగో కృష్ణారావు! అట్టా ఇరుక్కొని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది. వెనక్కి రా కబుర్లు చెప్పుకుందాం’’ అన్నారు సీయం.‘‘ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు’’ నవ్వుతూ వెనకసీట్లో సీయం పక్కన కూర్చొన్నారు హోంమంత్రి. కారు కదిలింది. ‘‘చిరునవ్వుతో ఎదురొచ్చే ముల్తైదువు కంటే సెక్యూరిటీ ఏం ఉంటుంది!’’ అన్నారు సీయం.
జీబు దిగి ఆ పోలీస్‌స్టేషన్‌లోకి రాజసంగా నడిచొచ్చాడు రౌడీషీటర్ నీలకంఠం. ‘‘నమస్తే బై. నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్‌కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను కలవాల్సిందే. నువ్వు కల్వలేదు. నేను బాధపడను. నేను ఏ మూమెంట్ చేసినా, ఏ స్పాట్‌పెట్టినా ముందుగా చెప్పేది పోలీసోళ్లకే’’తనను తాను పరిచయం చేసుకుంటూనే తనతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో చెప్పకనే చెప్పాడు నీలకంఠం.ఆ తరువాత ‘సంటీ’ అని పిలిచాడు. తమ్ముడు సంటి జర్దా నములకుంటూ నడుముకు కట్టుకున్న కాశీ తువ్వాలును విప్పాడు. అందులోని డబ్బుల కట్టలను టేబుల్‌పై వేశాడు. కుక్కకు బిస్కెట్ వేసినట్లుగా, తీసుకోమన్నట్లుగా తల ఊపాడు నీలకంఠం.‘‘ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్. వీక్లియా? మంత్లీయా? మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తాం. మన స్పాట్ మీద స్టేట్‌పాలిటిక్స్ నడుస్తుంది’’ ఇలా ఏవేవో మాట్లాడుతున్నాడునీలకంఠం.అటు నుంచి మాత్రం సౌండు లేదు. స్పందన లేదు.‘‘మాట్లాడు’’ అన్నాడు నీలకంఠం.నీలకంఠాన్ని కోపంగా ఒక్క తోపు తోసి...‘‘పోలీస్‌స్టేషన్ అంటే సారాబట్టీ అనుకున్నావా? ఊచల్లో పెట్టి వెన్నుపూసలు వంచడానికి వచ్చాను. మైండిట్ రాస్కెల్’’ అని హెచ్చరించాడు ఇన్‌స్పెక్టర్.
Comments
Please login to add a commentAdd a comment