Research Institute report
-
కూరగాయలే ఎక్కువగా తినాలి
రామచంద్రాపురం (పటాన్చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్‌లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు
స్టాక్‌హోమ్: భారత్ వద్ద అణ్వాయుధాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. చైనా, పాకిస్తాన్‌లు కూడా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేసి సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య గతేడాది తగ్గిందని, అయితే వాటిని ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. 2019 సంవత్సరాదిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్ద మొత్తం 13,865 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 600 అణ్వాయుధాలు తగ్గాయని తెలిపింది. అదే సమయంలో చైనా, భారత్, పాకిస్తాన్‌లు ఆయుధాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. ‘తక్కువే కానీ.. కొత్త ఆయుధాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోంది’అని ఆ సంస్థ డైరెక్టర్ షానన్ కైల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు తగ్గడానికి కారణం అమెరికా, రష్యాలే అని చెప్పారు. ఈ రెండు దేశాలు ‘న్యూ స్టార్ట్’(స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందంపై 2010లో సంతకం చేశాయి. దీని ప్రకారం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి నుంచి ఉన్న పాత ఆయుధాలను ఈ రెండు దేశాలు వదిలించుకుంటున్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు 2021 నాటికి ముగిసిపోతుందని, దీని పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అణ్వాయుధాలు ఉండేవని, దాదాపు అప్పుడు 70 వేల ఆయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉండేవని.. అప్పటి నుంచి ఆయుధాల సంఖ్య తగ్గుతూ వస్తోందని కైల్ వివరించారు. -
మహిళలకు వేతనాలు తక్కువే!
* భారతీయ ఐటీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ నివేదిక * పురుషులతో పోలిస్తే వ్యత్యాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: భారతీయ ఐటీ పరిశ్రమ ఉద్యోగుల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వేతనాల పెంపు విషయంలో మహిళలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉదంతం నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆరంభంలో ఒకే స్థాయి వేతనాలతోనే మహిళ, పురుష ఉద్యోగులు తమ కెరీర్‌ను మొదలు పెడుతున్నప్పటికీ.. కొంతకాలానికి వేతనాల్లో వ్యత్యాసం ఎగబాకుతోందని కెటలిస్ట్ ఇండియా డబ్లూఆర్సీ అనే సంస్థ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. మహిళలకు వేతనాలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. కాగా, నాదెళ్లలాంటి దిగ్గజ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని.. అయితే, తన తప్పును వెంటనే అంగీకరించి ఆయన క్షమాపణ చెప్పడం గొప్పవిషయమని కెటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ షాచి ఇర్డే పేర్కొన్నారు. సుమారు 58 దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది. అన్నిరంగాల్లోనూ...: వ్యాపారం, ఆర్థిక రంగం, సామాజిక రంగం ఇలా మగాళ్లకు అవకాశాలున్న ప్రతిచోటా మహిళలకూ అవకాశాలు ఇవ్వాల్సిందేనని ఇర్డే అన్నారు. ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా.. ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ ఉద్యోగుల వేతనాల్లో స్త్రీ-పురుష వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోందని కెటలిస్ట్ గ్లోబల్ రీసెర్చ్ పేర్కొంది. ‘భారత్ విషయానికొస్తే... టెక్నాలజీ రంగంలో మేం చేసిన అధ్యయనం ప్రకారం మహిళలు-పురుషులు ఇద్దరూ ఒకే విధమైన బాధ్యతలు, వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే, కొంతకాలం గడిచేసరికి వేతనాల్లో తేడా భారీగా ఉంటోంది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌ను చూస్తే.. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు సుమారు రూ.3.8 లక్షల మేర వేతన వ్యత్యాసం ఉంటోంది. ఈ తేడాను తొలగించేందుకు నాయకత్వపరమైన, పటిష్ట చర్యలు అవసరం’ అని ఇర్డే వ్యాఖ్యానించారు.