స్టాక్‌హోమ్: భారత్ వద్ద అణ్వాయుధాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. చైనా, పాకిస్తాన్‌లు కూడా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చేసి సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య గతేడాది తగ్గిందని, అయితే వాటిని ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది.
2019 సంవత్సరాదిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్ద మొత్తం 13,865 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 600 అణ్వాయుధాలు తగ్గాయని తెలిపింది. అదే సమయంలో చైనా, భారత్, పాకిస్తాన్‌లు ఆయుధాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. ‘తక్కువే కానీ.. కొత్త ఆయుధాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోంది’అని ఆ సంస్థ డైరెక్టర్ షానన్ కైల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు తగ్గడానికి కారణం అమెరికా, రష్యాలే అని చెప్పారు.
ఈ రెండు దేశాలు ‘న్యూ స్టార్ట్’(స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందంపై 2010లో సంతకం చేశాయి. దీని ప్రకారం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి నుంచి ఉన్న పాత ఆయుధాలను ఈ రెండు దేశాలు వదిలించుకుంటున్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు 2021 నాటికి ముగిసిపోతుందని, దీని పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అణ్వాయుధాలు ఉండేవని, దాదాపు అప్పుడు 70 వేల ఆయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉండేవని.. అప్పటి నుంచి ఆయుధాల సంఖ్య తగ్గుతూ వస్తోందని కైల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment