విదేశీయానంలోనూ కార్డు..
సెలవులను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళుతున్నారా? అయితే ఫారెక్స్ కార్డ్ గురించి మరిన్ని సంగతులను తెలుసుకోండి! భారతీయులు విదేశాలను సందర్శించడం ఇటీవల అధికమైంది. ఫారిన్ ప్రయాణానికి బయల్దేరేముందు సిద్ధం చేసుకోవాల్సిన తప్పనిసరి జాబితాలో విదేశీ కరెన్సీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంప్రదాయ రీతిలో ట్రావెలర్ చెక్కులను, విదేశీ కరె న్సీని తీసుకెళ్లడం కంటే ఉత్తమమైన ఆప్షన్‌గా ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది సురక్షితమైనదే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లా పనిచేసే ఫారెక్స్ కార్డ్‌ను విదేశీ ఎటీఎంలలో వినియోగించవచ్చు. కనీస లావాదేవీ చార్జీలే వర్తిస్తాయి. అంతేకాకుండా కరెన్సీల్లో హెచ్చుతగ్గుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
మల్టీ కరెన్సీ కార్డ్‌లు మేలు
మల్టీ కరెన్సీ ప్లాటినం ఫారెక్స్‌ప్లస్ కార్డ్‌లను తీసుకుంటే మరిన్ని సౌకర్యాలు లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే ఫారెక్స్ కార్డ్‌పై 18 రకాల విదేశీ కరెన్సీలను ఆఫర్ చేస్తోంది. ఇలాంటి కార్డ్ ఉంటే రకరకాల దేశాలను సందర్శించేటపుడు రకరకాల కరెన్సీలను తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. తద్వారా క్రాస్ కరెన్సీ చార్జీలనుంచి తప్పించుకోవచ్చు. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జారీ చేసే మల్టీ కరెన్సీ కార్డ్... యూరప్‌లో ఆరు దేశాల కరెన్సీలను ఆఫర్ చేస్తోంది. ఈ కార్డ్‌లను బ్యాంకు బ్రాంచీలలోనే కాకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. రిటైలర్లేకాకుండా కార్పొరేట్ సంస్థలు కూడా తమ సిబ్బంది ప్రయాణాలకు వీటినే వినియోగిస్తున్నాయి.
పరిమితికిలోబడే...
విదేశీ మారక చట్టాలకు అనుగుణంగా అనుమతించిన స్థాయిలో కస్టమర్లు కార్డ్‌లో కరెన్సీని లోడ్ చేసుకోవచ్చు. విదేశీ సందర్శకులైతే ఒక ఆర్థిక సంవత్సరంలో 10,000 డాలర్ల వరకూ అనుమతిస్తారు. బిజినెస్ ప్రయాణికులైతే ట్రిప్‌నకు 25,000 డాలర్లను అనుమతిస్తారు. కరెన్సీ మార్పిడి కోసం బ్రాంచీలకు వెళ్లనక్కర్లేదు. డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగానే ఫారెక్స్ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ కార్డ్ పోగొట్టుకుంటే మిగిలిన మొత్తాన్ని నిలిపివేయవచ్చు. కొన్ని సందర్భాల్లో భోజనం, వినోదం వంటి వ్యయాల్లో ఆఫర్లు లభిస్తాయి కూడా.