
ఫోర్టిస్ హెల్త్ కేర్ నుంచి
♦ డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభజన
♦ విడదీతకు బోర్డు ఆమోదం
♦ గ్రూప్ సంస్థ ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్‌లోకి విలీనం
న్యూఢిల్లీ: డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభజన ప్రతిపాదనకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అనుబంధ సంస్థ ఎస్‌ఆర్‌ఎల్‌లో కూడా ఉన్న డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభాగం మొత్తం.. మరో గ్రూప్ సంస్థ ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్‌లో (ఎఫ్‌హెచ్‌ఎంఎల్) విలీనం చేయనున్నారు. అలాగే ఫోర్టిస్ మలార్ నిర్వహిస్తున్న హాస్పిటల్ వ్యాపారాన్ని ఫోర్టిస్ హెల్త్‌కేర్ (ఎఫ్‌హెచ్) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఏకమొత్తంగా రూ. 43 కోట్లు చెల్లిస్తుంది.
ఆ తర్వాత ఫోర్టిస్ మలార్ పేరును ఎస్‌ఆర్‌ఎల్‌గా మారి.. ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతుందని ఎఫ్‌హెచ్ తెలిపింది. ఫోర్టిస్ మలార్ ప్రస్తుతం చెన్నైలో ఒక ఆస్పత్రిని నిర్వహిస్తోంది. ఈ లావాదేవీతో అటు ఆసుపత్రి, ఇటు డయాగ్నాస్టిక్స్ వ్యాపార విభాగాలు మరింత మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మల్వీందర్ సింగ్ తెలిపారు. సంక్లిష్టమైన వ్యాపార విభజన ప్రతిపాదన ప్రకారం .. 0.98:1 నిష్పత్తిలో ఫోర్టిస్ హాస్పిటల్స్ షేర్‌హోల్డర్లకు ఫోర్టిస్ మలార్ షేర్లను కేటాయిస్తుంది. అలాగే, 10.8:1 నిష్పత్తిలో ఎస్‌ఆర్‌ఎల్ షేర్‌హోల్డర్లకు కూడా షేర్లను కేటాయిస్తుంది. తాజా పరిణామాల దరిమిలా బీఎస్‌ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు సుమారు 3 శాతం క్షీణించి రూ. 187.80 వద్ద ముగిశాయి.