ఫోర్బ్స్ దానకర్ణుల జాబితాలో నలుగురు భారతీయులు
సింగపూర్: ఆసియా పసిఫిక్‌లోని కుబేరులు, వ్యాపారవేత్తల్లో దాతృత్వగుణం కలిగినవారితో ఫోర్బ్స్ రూపొందించిన తాజా వార్షిక జాబితాలో రోహిణీ నిలేకని, అజయ్ పిరమల్ సహా నలుగురు భారతీయులకు చోటు లభించింది. ఈ జాబితాలో మొత్తం 48 మంది ఉండగా, ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, దక్షిణకొరియా, తైవాన్, థాయిలాండ్‌లకు చెందిన వారు నలుగురు చొప్పున ఉన్నారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని భార్య రోహిణీ నీలేకని (55) గత కొన్నేళ్లలో నాలుగు కోట్ల డాలర్లను (సుమారు రూ.240 కోట్లు) సమాజసేవకు ఖర్చు చేశారని ఫోర్బ్స్ తెలిపింది. ఆర్ఘ్యం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, భారత్‌లో భూగర్భ జల పరిరక్షణకు, పారిశుధ్యం మెరుగుకు పాటుపడే ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొంది. ఫార్మా ప్రముఖుడు అజయ్ పిరమల్ (58) గత నాలుగేళ్లలో పిరమల్ ఫౌండేషన్‌కు 60 లక్షల డాలర్లు (సుమారు రూ.36 కోట్లు) విరాళమిచ్చారని ఫోర్బ్స్ వివరించింది. ఈ జాబితాలో చోటు దక్కిన భారతీయుల్లో లుపిన్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ దేశ్ బంధు గుప్తా (75), సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆశిశ్ ధావన్ కూడా ఉన్నారు.