ఐదేళ్లలో 4 వండర్‌లా కొత్త పార్క్‌లు
⇒ రూ.350 కోట్లతో చెన్నైలో 56 ఎకరాల్లో ప్రారంభం
⇒ శరవేగంగా నిర్మాణ పనులు; రెండేళ్లలో అందుబాటులోకి
⇒ ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా..
⇒ ఏడాదిలో 6.2 లక్షలకు హైదరాబాద్ పార్క్ సందర్శకులు
⇒ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్‌లా దేశంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 4 అమ్యూజ్‌మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ముందుగా రూ.350 కోట్ల పెట్టుబడులతో చెన్నైలో ప్రారంభించనుంది. పాత మహాబలిపురంలో రోడ్డులో 56 ఎకరాల్లో పార్క్‌ను నిర్మిస్తున్నామని, రెండేళ్లలో పార్క్‌ను అందుబాటులోకి వస్తుందని వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి తెలిపారు. ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారమిక్కడ వండర్‌లా కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో మార్కెటింగ్ కోసం రూ.26 కోట్లు కేటాయించామని ఇందులో భాగంగా కొత్త లోగోను డిజైన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్‌లుండగా.. 26 లక్షల మంది సందర్శించారని తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధిని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లో పార్క్‌ను ప్రారంభించి నేటితో ఏడాది. తొలి సంవత్సరంలో 6.2 లక్షల మంది సందర్శించారు. ఈ ఏడాది 8 లక్షలు, మూడేళ్లలో 10 లక్షల సందర్శకులు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాతే హైదరాబాద్‌లోనూ రిసార్ట్ ఏర్పాటు యోచన చేస్తామని తెలియజేశారు. కొత్త కస్టమర్లనే కాకుండా పాత కస్టమర్లనూ అకర్షించేందుకు ప్రతి ఏటా రూ.30–40 కోట్ల పెట్టుబడులతో కొత్త కొత్త రైడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ వేసవిలో హైదరాబాద్ పార్క్‌లో స్కై వీల్‌ను, సెప్టెంబర్‌లో ఫ్లై థీమ్ స్పేస్ థియేటర్‌ను, కోచిలో రోలర్ కోస్ట్, బెంగళూరులో ఫ్యామిలీ రైడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు.
ఏపీలో పార్క్ ప్రాథమిక స్థాయిలోనే..
ఆంధ్రప్రదేశ్‌లో పార్క్ ఏర్పాటు ఒప్పందం గురించి ప్రశ్నించగా.. ‘‘రూ.350 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రెండేళ్ల క్రితమే ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ, అదింకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. స్థల ఎంపిక, రాయితీలపై స్పష్టత వచ్చాకే పార్క్ ఏర్పాటుపై ముందడుగేస్తామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు సమాధానమిచ్చారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్‌లున్నాయి. ఇప్పటివరకు 3 కోట్ల మంది సందర్శించారు.