సాక్షి, ముంబై: ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్ , తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ భారీ ప్రణాళికలతో దూసకువస్తోంది. భారత్‌లో తాజాగా రూ. 6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రడీ అవుతోంది. ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థలకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంస్థ దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని సెజ్‌లో ఒక ప్లాంట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తోంది. తద్వారా వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
తాజా సమాచారం ప్రకారం ఐ ఫోన్‌కు అతి పెద్ద సప్లయర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్ ముంబైలోని జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు యోచిస్తోంది. దీని ద్వారా దాదాపు 40వేలమంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అంచనా. మరోవైపు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఫాక్స్‌కాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సెజ్‌కోసం దాదాపు 20, 30 కంపెనీలు ఇప్పటికే సంప్రదించాయని, దీని ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను అంచనా వేస్తున్నామని గడ్కరీ తెలిపారు.
కాగా చైనాకు సమాంతరంగా భారత్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించాలనే యోచనలో భాగంగా ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ సెజ్‌లో ఐదు ప్లాంట్లు నిర్మించింది. ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్‌కాన్ సంవత్సరానికి దాదాపు 15 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇన్‌ఫోకస్, ఒప్పో, షావోమీ, నోకియా, జియోనీ తదితర కంపెనీలకు భారత్‌లోని ప్లాంట్లలో ఫాక్స్‌కాన్ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment