Foxconn Technology Group
-
మరో రూ.3,318 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ గ్రూప్ రాష్ట్రంలో మరో రూ.3,318 కోట్ల (400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధి వీ లీ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ను ధ్రువీకరిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ‘ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ బంధం వేగంగా పురోగమిస్తోంది. పరస్పర ఒప్పందంలో పేర్కొన్న అంశాలను ఇరువురం వేగంగా అమలు పరుస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రూ.4,562 కోట్ల (550 మిలియన్ డాలర్లు) పెట్టుబడి హామీని ఫాక్స్‌కాన్ నెరవేర్చింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలనే ప్రతిపాదననను ‘ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ’ (ఎఫ్ఐటీ) ఆమోదించినట్లు బోర్డు చైర్మన్ లూ సంగ్ చింగ్ కూడా మరో ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎయిర్పాడ్స్తోపాటు మొబైల్ ఫోన్ల ఇతర విడిభాగాల తయారీలో ఫాక్స్‌కాన్‌కు దిగ్గజ సంస్థగా పేరుంది. ఇది మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌కు ప్రధాన విడిభాగాల సరఫరాదారుగా ఉంది. ఫాక్స్‌కాన్ తొలి విడతలో రూ.1,244 కోట్లు (150 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌లో 196 ఎకరాల్లో ఏర్పాటు ఇప్పటికే కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్ తెలంగాణలోనూ కార్యకలాపాలు ప్రారంభించే ఉద్దేశంతో గత మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌కు 196 ఎకరాలు కేటాయించింది. గత మే 15న ఫాక్స్‌కాన్ యూనిట్‌కు శంకుస్థాపన జరగ్గా ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ఎల్ఈడీ విద్యుద్దీపాలు, వాననీటిని ఒడిసి పట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం, సిబ్బందికి బస వంటి అనేక ప్రత్యేకతలు ఈ క్యాంపస్‌లో ఉంటాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుండగా, ఫాక్స్‌కాన్ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
కొంగర కలాన్‌లోనే ‘ఫాక్స్‌కాన్’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తన తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో ఆ పరిశ్రమ ఏర్పాటుపై తలెత్తిన అనుమానాలకు తెరపడింది. ఈ నెల 2న ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ ల్యూ బృందం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ అయ్యారు. ఆ తరువాత బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైని సైతం కలిశారు. అనంతరం లక్ష ఉద్యోగాలు కల్పించేలా ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో ఆ సంస్థ ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటికి సమాధానంగా అన్నట్లు ఫాక్స్‌కాన్ చైర్మన్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మీ సంపూర్ణ మద్దతు కోరుతున్నా.. ‘మేము వీలైనంత త్వరలో కొంగరకలాన్‌లో మా సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. అందుకు మీ సంపూర్ణ మద్దతు కోరుతున్నా. హైదరాబాద్ పర్యటనలో అద్భుతమైన సమయాన్ని గడిపాం. మీ ఆతిథ్యం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. నా పుట్టిన రోజున స్వదస్తూరితో మీరు గ్రీటింగ్ కార్డు ఇవ్వడం వ్యక్తిగతంగా అమితానందాన్ని కలిగించింది’అని లేఖలో యంగ్ ల్యూ పేర్కొన్నారు. భారత్‌లో నాకు కొత్త స్నేహితుడు.. ‘తెలంగాణ అభివృద్ధి దిశగా పురోగమించడానికి మీరు చేస్తున్న కృషి, కనబరుస్తున్న దార్శనికత నుంచి స్ఫూర్తి పొందా. నాకు ఇప్పుడు భారత్‌లో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. తైపీలో మీకు ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తా. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా’అని యంగ్ ల్యూ లేఖలో తెలిపారు. రాష్ట్రానికి గొప్ప విజయం: సీఎంవో తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యంగ్ ల్యూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి దక్కిన గొప్ప విజయంగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
హైదరాబాద్‌కు ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్!
తైవాన్‌కు చెందిన యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్ ఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ..తమ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్ టెక్నాలజీ చైర్మన్ యంగ్ లియూ మార్చి 2న సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను మాటిచ్చినట్లుగానే..రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఫాక్స్‌కాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు సిద్ధమైనట్లు కేసీఆర్‌కు లేఖ రాశారు. తద్వారా లక్షమందికి ఉపాధి కలుగుతుందని అందులో పేర్కొన్నారు. కొంగరకలాన్ లో ప్లాంట్ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు యంగ్ లియూ. రాష్ట్రాభివృద్ధి పట్ల కేసీఆర్ కు ఉన్న విజన్ తనకు నచ్చిందన్నారు లియూ. వీలైనంత త్వరగా కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ను ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. రూ.3500 కోట్ల పెట్టుబడులు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించినట్లు సమాచారం. కర్ణాటకలో ఒక ప్లాంటు తెలంగాణలో పెట్టుబడులపై ప్రకటన వెలువరించకముందు కర్ణాటకలో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఫాక్స్‌కాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో అక్కడ కూడా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాతే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్ సంస్థ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందని, ఆ పెట్టుబడుల కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఎంఓయూ (MOU) కూడా పూర్తయిందని చెప్పిన బొమ్మై.. ఫాక్స్ కాన్ ప్లాంట్ కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో దొడ్డబల్లాపూర్, దేవంగల్లి తాలూకా ప్రాంతంలో 300 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. Chairman, @HonHai_Foxconn Mr. Young Liu, in a letter addressed to CM Sri KCR, has stated that he was inspired by the vision and efforts of the #Telangana CM towards transformation and development of the State. pic.twitter.com/dJ82MinS14 — Telangana CMO (@TelanganaCMO) March 6, 2023 -
ఆపిల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ..!
స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎథర్ ఎనర్జీ తన ఎథర్ 450 ఎక్స్, ఎథర్ 450 ప్లస్ స్కూటర్లకి చెందిన కీలక భాగాలను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ సబ్సిడరీ భారత్ ఎఫ్ఐహెచ్'తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఎథర్ ఎనర్జీ నేడు చేసిన ఒక ప్రకటనలో.. దేశీయంగా ఏర్పడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ కొరతను తీర్చడానికి ఈ భాగస్వామ్యం ఒప్పందం సంస్థకు సహకరిస్తుందని తెలిపింది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ దేశీయంగా ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్'లను అసెంబ్లింగ్ చేస్తుంది. భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫౌల్గర్ మాట్లాడుతూ.. "భారతదేశంలో వారి ఎలక్ట్రిక్ వాహన ప్రయాణానికి మద్దతు ఇవ్వడంలో ఎథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి పేరు గల సంస్థలో అంతర్భాగం కావడంతో మా ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు, సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరించడానికి మేము ఎదురు చూస్తున్నాము" అని ఆయన అన్నారు. బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్, డ్యాష్ బోర్డ్ అసెంబ్లీ, పెరిఫెరల్ కంట్రోల్ యూనిట్, డ్రైవ్ కంట్రోల్ మాడ్యూల్స్ కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్(పీసీబీ) అసెంబ్లీలు వంటి వాటిని భారత్ ఎఫ్ఐహెచ్ తయారు చేస్తుంది. భారత్ ఎఫ్ఐహెచ్ ఈ ఉత్పత్తులను ఎథర్ ఎనర్జీ కోసం 'టర్న్ కీ' మోడల్'పై తయారు చేస్తుంది. వారి ఫెసిలిటీ వద్ద ఎథర్ స్కూటర్ల కోసం విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఎథర్ ఎనర్జీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకెళ్తుంది. గత ఏడాది అమ్మకాల్లో 20 శాతం వృద్దిని నమోదు చేసింది. ఎథర్ ఎనర్జీ దాదాపు 99 శాతం ఉత్పత్తులు దేశీయంగా తయారు చేస్తుంది. దీర్ఘకాలిక డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఎథర్ ఎనర్జీ తన హోసూర్ ఫెసిలిటీని సంవత్సరానికి 120,000 నుంచి 400,000 యూనిట్ల సామర్ధ్యానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్ పోలీసులు) -
ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!
మన దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయడం కోసం వేదాంత గ్రూపు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ పెట్టుబడిని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేదాంత గ్రూపుకు చెందిన అవన్ స్ట్రేట్ సంస్థ 2025 నాటికి భారతీయ తయారీ ప్లాంట్ల నుంచి ఎలక్ట్రానిక్ చిప్స్ & డిస్ప్లేలను విడుదల చేయాలని ఆశిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. "సెమీకండక్టర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాపారం. మేము డిస్ప్లే తయారీ రంగంలో సుమారు 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాము. ప్రస్తుతం మేము ఈ సెమీకండక్టర్ రంగంలో 7 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాము, ఆ తర్వాత ప్లాంట్ విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడి మరో 3 బిలియన్ డాలర్లు కూడా పెరగవచ్చు. మొదటి 10 సంవత్సరాల మేము 15 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాము. తదుపరి దశలో మరిన్ని పెట్టుబడులను పెడుతాము" అని అవన్ స్ట్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ అకర్ష్ హెబ్బర్ చెప్పారు. సెమీకండక్టర్ ప్లాంట్ & డిస్ప్లే తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవన్ స్ట్రేట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారు కోసం జాయింట్ వెంచర్ కింద కంపెనీని ఏర్పాటు చేయడానికి వేదాంత గ్రూప్, ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ సంస్థలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల(రూ.76,000 కోట్లు) పథకాన్ని ప్రకటించిన తర్వాత సెమీకండక్టర్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంస్థలలో మొదటి సంస్థ వేదాంత గ్రూప్. (చదవండి: ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..!) -
AP: పెట్టుబడులకు పెట్టని కోట
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సింహద్వారంగా మారుతోంది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయనేందుకు ప్రముఖ కంపెనీల మనోగతమే నిదర్శనం. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావడమే ఆలస్యం అతి వేగంగా కీలకమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తుండటంతో పునాది సమయంలోనే కార్పొరేట్ సంస్థలు విస్తరణ ప్రణాళికలను సైతం ప్రకటిస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకుండానే విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. పాత బకాయిలు సైతం.. గత సర్కారు మాదిరిగా పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టకుండా సకాలంలో ఇవ్వడంతోపాటు పాత బకాయిలను సైతం పిలిచి మరీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది. ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ పరిశ్రమలకు మొదటి విడతలో రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం రెండో విడతలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్ రూ.684 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.2,248 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు.. ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా ప్రతిపాదనల దగ్గర నుంచి ఓ కంపెనీకి జీవిత కాలం అండగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండే విధంగా, కంపెనీలకు మెరుగైన ఆదాయం లభించేలా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేసి అందచేస్తోంది. దీంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం ఇలా.. ► జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతిపాదనను రూ.2,500 కోట్లకు పెంచింది. ► తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్న సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రతిపాదన అందిన రెండు నెలల్లోనే యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో సెంచరీ ఫ్లైవుడ్ తన పెట్టుబడులను రూ.600 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక స్వయంగా ప్రకటించారు. ► కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ స్థాపించే యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నామని, యూనిట్‌ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ► రూ.50 కోట్లతో బ్లూటూత్, పవర్ బ్యాంక్, రూటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల యూనిట్‌ను సెల్కాన్ రెజల్యూట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వై.గురు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వైఎస్ఆర్ ఈఎంసీలో ఆరు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. ► యాపిల్, రెడ్మీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ సెల్ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ జోష్ ఫల్గర్ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్ ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ► రాష్ట్రం నుంచి కియా మోటార్స్ చెన్నై తరలి వెళ్లిపోతోందంటూ ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ రూ.409 కోట్లతో విస్తరణ ప్రణాళికను సైతం కియా మోటార్స్ ప్రకటించింది. ఏపీలో సరికొత్త నినాదం.. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలను తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందచేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
ఈవీ తయారీలోకి ఫాక్స్‌కాన్.. భారత్‌లో కూడా!
Taiwan Foxconn EV India: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్, క్రేజ్ పెరుగుతున్న తరుణంలో పలు కంపెనీలు ఆటోమొబైల్ రంగం వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఈవీ తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మేరకు బుధవారం ఫాక్స్‌కాన్ చైర్మన్ లీయూ యంగ్ వే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జర్మన్ ఆటోమేకర్స్ పరోక్ష సహకారంతో ఈ వాహనాల ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు సోమవారం మూడు కార్ల నమునాను సైతం లీయూ, తైపీలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శించారు. భారత దేశంతో పాటు యూరప్, లాటిన్ అమెరికా ఖండాల్లో ఈవీ వాహనాల తయారీని చేయనున్నట్లు ప్రకటించారాయన. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా డెవలప్ చేస్తున్న ‘ఇ సెడాన్’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు, ఐదు సీట్లు కలిగిన ‘మోడల్ ఇ’ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే జర్మన్ టెక్నాలజీ నేపథ్యంలో తమ తొలి ప్రాధాన్యం యూరప్‌గానే ఉంటుందన్న లీయూ, ఆ తర్వాతి ప్రాధాన్యం మాత్రం భారత్‌లోనేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తైవాన్‌కు చెందిన హోన్ హాయ్ ప్రెసిషన్ కంపెనీ.. ఎలక్ట్రిక్ గూడ్స్ తయారీలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ట్యూచెంగ్ కేంద్రంగా అంతర్జాతీయంగా 13 లక్షల ఉద్యోగులతో భారీ మార్కెట్‌ను విస్తరించుకుంది. అంతేకాదు తైవాన్‌లో యాపిల్ ప్రొడక్టులకు సప్లయర్‌గా ఉంది. క్లిక్ చేయండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి గుడ్‌న్యూస్ -
సీఎం జగన్‌ను కలిసిన ఫాక్స్కన్ ఎండీ
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఫాక్సకన్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ) మేనేజింగ్ డైరెక్టర్ జోష్ పాల్గర్, కంపెనీ ప్రతినిధి లారెన్స్ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో ఫాక్సకన్ కంపెనీ విస్తరణ, పెట్టుబడులపై సీఎం వైఎస్ జగన్‌తో పాల్గర్ చర్చించారు. ఫాక్స్కన్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చదవండి: Vaccination In AP: వ్యాక్సినేషన్లో ఏపీ మరో ఘనత కోవిడ్ కష్టకాలంలోనూ నెల్లూరు జిల్లా తడ, శ్రీ సిటీలో తమ ప్లాంటు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం మంచి సహకారం అందించిందని సీఎంకు పాల్గర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, వైఎస్సార్ ఈఎంసీ సీఈవో నందకిషోర్ పాల్గొన్నారు. -
ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు: వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్ , తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ భారీ ప్రణాళికలతో దూసకువస్తోంది. భారత్‌లో తాజాగా రూ. 6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రడీ అవుతోంది. ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థలకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంస్థ దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని సెజ్‌లో ఒక ప్లాంట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తోంది. తద్వారా వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. తాజా సమాచారం ప్రకారం ఐ ఫోన్‌కు అతి పెద్ద సప్లయర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్ ముంబైలోని జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు యోచిస్తోంది. దీని ద్వారా దాదాపు 40వేలమంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అంచనా. మరోవైపు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఫాక్స్‌కాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సెజ్‌కోసం దాదాపు 20, 30 కంపెనీలు ఇప్పటికే సంప్రదించాయని, దీని ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను అంచనా వేస్తున్నామని గడ్కరీ తెలిపారు. కాగా చైనాకు సమాంతరంగా భారత్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించాలనే యోచనలో భాగంగా ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ సెజ్‌లో ఐదు ప్లాంట్లు నిర్మించింది. ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్‌కాన్ సంవత్సరానికి దాదాపు 15 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇన్ఫోకస్, ఒప్పో, షావోమీ, నోకియా, జియోనీ తదితర కంపెనీలకు భారత్‌లోని ప్లాంట్లలో ఫాక్స్‌కాన్ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు
- హైదరాబాద్‌లో డేటా సెంటర్, ఏపీలో తయారీ యూనిట్ - ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు - వెల్లడించిన కంపెనీ చీఫ్ టెర్రీ న్యూఢిల్లీ: ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను, ఇంక్యూబేటర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఈ గ్రూప్ హెడ్ టెర్రీ గౌ చెప్పారు. ఫాక్స్‌కాన్ కంపెనీ యాపిల్ కోసం ఐఫోన్లను, ఐప్యాడ్లను, అమెజాన్ కోసం కిండిల్ ట్యాబ్‌లను, ఇతర కంపెనీలకు ట్యాబ్‌లను, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది. 2020 కల్లా భారత్‌లో 10-12 తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, కనీసం పది లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామని భారత్‌లో స్వల్పకాల పర్యటన సందర్భంగా ఆయన వెల్లడించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. యాపిల్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్, హ్యులెట్-ప్యాకార్డ్ తదితర కంపెనీలకు తైవాన్‌కు చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌లో మొబైల్సే కాకుండా ట్యాబ్‌లు, టీవీలు, బ్యాటరీలు, రూటర్లు తదితర వస్తువులను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.