సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ గ్రూప్ రాష్ట్రంలో మరో రూ.3,318 కోట్ల (400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధి వీ లీ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ను ధ్రువీకరిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ‘ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ బంధం వేగంగా పురోగమిస్తోంది. పరస్పర ఒప్పందంలో పేర్కొన్న అంశాలను ఇరువురం వేగంగా అమలు పరుస్తున్నాం.
ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రూ.4,562 కోట్ల (550 మిలియన్ డాలర్లు) పెట్టుబడి హామీని ఫాక్స్‌కాన్ నెరవేర్చింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలనే ప్రతిపాదననను ‘ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ’ (ఎఫ్‌ఐటీ) ఆమోదించినట్లు బోర్డు చైర్మన్ లూ సంగ్ చింగ్ కూడా మరో ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఎయిర్‌పాడ్స్‌తోపాటు మొబైల్ ఫోన్ల ఇతర విడిభాగాల తయారీలో ఫాక్స్‌కాన్‌కు దిగ్గజ సంస్థగా పేరుంది. ఇది మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌కు ప్రధాన విడిభాగాల సరఫరాదారుగా ఉంది. ఫాక్స్‌కాన్ తొలి విడతలో రూ.1,244 కోట్లు (150 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.
కొంగరకలాన్‌లో 196 ఎకరాల్లో ఏర్పాటు
ఇప్పటికే కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్ తెలంగాణలోనూ కార్యకలాపాలు ప్రారంభించే ఉద్దేశంతో గత మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌కు 196 ఎకరాలు కేటాయించింది. గత మే 15న ఫాక్స్‌కాన్ యూనిట్‌కు శంకుస్థాపన జరగ్గా ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ యూనిట్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు, వాననీటిని ఒడిసి పట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం, సిబ్బందికి బస వంటి అనేక ప్రత్యేకతలు ఈ క్యాంపస్‌లో ఉంటాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుండగా, ఫాక్స్‌కాన్ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment