AP: పెట్టుబడులకు పెట్టని కోట  | Industrialists Confidence Increased To Invest In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: పెట్టుబడులకు పెట్టని కోట 

Published Sat, Dec 25 2021 5:27 AM | Last Updated on Sat, Dec 25 2021 6:57 PM

Industrialists Confidence Increased To Invest In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ సింహద్వారంగా మారుతోంది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయనేందుకు ప్రముఖ కంపెనీల మనోగతమే నిదర్శనం. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావడమే ఆలస్యం అతి వేగంగా కీలకమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తుండటంతో పునాది సమయంలోనే కార్పొరేట్‌ సంస్థలు విస్తరణ ప్రణాళికలను సైతం ప్రకటిస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకుండానే విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. 

పాత బకాయిలు సైతం..
గత సర్కారు మాదిరిగా పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టకుండా సకాలంలో ఇవ్వడంతోపాటు పాత బకాయిలను సైతం పిలిచి మరీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది. ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు మొదటి విడతలో రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం రెండో విడతలో ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్‌ రూ.684 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.2,248 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే చెల్లించింది.

నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు..
‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ ద్వారా ప్రతిపాదనల దగ్గర నుంచి ఓ కంపెనీకి జీవిత కాలం అండగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండే విధంగా, కంపెనీలకు మెరుగైన ఆదాయం లభించేలా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేసి అందచేస్తోంది. దీంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి.

పెట్టుబడుల ప్రవాహం ఇలా..
జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్‌ టైర్‌ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది.  విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు  ప్రారంభించిన సంస్థ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతిపాదనను రూ.2,500 కోట్లకు పెంచింది. 
► తొలుత తమిళనాడులో యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకున్న సెంచరీ ప్లైవుడ్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో యూనిట్‌ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రతిపాదన అందిన రెండు నెలల్లోనే యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో సెంచరీ ఫ్లైవుడ్‌ తన పెట్టుబడులను రూ.600 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక స్వయంగా ప్రకటించారు. 
► కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్‌ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ స్థాపించే యూనిట్‌ ద్వారా శామ్‌సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నామని, యూనిట్‌ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.
► రూ.50 కోట్లతో బ్లూటూత్, పవర్‌ బ్యాంక్, రూటర్స్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల యూనిట్‌ను సెల్‌కాన్‌ రెజల్యూట్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వై.గురు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వైఎస్‌ఆర్‌ ఈఎంసీలో ఆరు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు.
► యాపిల్, రెడ్‌మీ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌ సెల్‌ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్‌ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ జోష్‌ ఫల్గర్‌ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్‌ఆర్‌ ఈఎంసీలో యూనిట్‌ ఏర్పాటు చేయాలంటూ ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది.
► రాష్ట్రం నుంచి కియా మోటార్స్‌ చెన్నై తరలి వెళ్లిపోతోందంటూ ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ రూ.409 కోట్లతో విస్తరణ ప్రణాళికను సైతం కియా మోటార్స్‌ ప్రకటించింది.  

ఏపీలో సరికొత్త నినాదం..
రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్‌ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు. – కొప్పర్తిలో ఏఐఎల్‌ డిక్సన్‌ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ

అంతకు మించి..
తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్‌లో సెంచురీ ఫ్లైవుడ్‌ కంపెనీ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక

మరిన్ని కంపెనీలను తీసుకొస్తాం
పెట్టుబడి ప్రతిపాదన అందచేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు అనేక కంపెనీలను  తీసుకురావడానికి కృషి చేస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ప్రకటన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement