వాహనాలు.. టాప్ గేర్! | Fresh start: Maruti Suzuki, Hyundai, Mahindra begin new fiscal with robust sales | Sakshi
Sakshi News home page

వాహనాలు.. టాప్ గేర్!

Published Tue, May 3 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

వాహనాలు.. టాప్ గేర్!

వాహనాలు.. టాప్ గేర్!

ఏప్రిల్‌లో మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా జోరు
టూవీలర్ అమ్మకాలు కూడా రయ్.. రయ్

 న్యూఢిల్లీ: వాహన విక్రయాలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల(ఏప్రిల్)లో జోరుగా సాగాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా సహా పలు కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ అమ్మకాలు మాత్రం పతనమయ్యాయి.  టూవీలర్ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీల  విక్రయాలు కూడా బాగా పెరగ్గా బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి.

తక్కువ  బేస్ ఎఫెక్ట్ (గత ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు తక్కువ స్థాయిలో ఉండడం), కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేవడం,  పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో వాహన విక్రయాలు జోరుగా సాగాయని విశ్లేషకులంటున్నారు. ఇదే జోరును కొనసాగిస్తామని పలు కంపెనీలు పేర్కొన్నాయి. వివరాలు..

కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ప్రీమియం కార్లు- సియాజ్, బాలెనో, విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్‌ల అమ్మకాలు బాగా ఉన్నాయని మారుతీ సుజుకి ఇండియా ఈడీ, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఈ కార్లకు డెలివరీ చేసే కాలాన్ని(వెయిటింగ్ పీరియడ్)ను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు మూడు రెట్లు, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 8 శాతం చొప్పున పెరిగాయని, మిని సెగ్మెంట్ కార్ల విక్రయాలు 10 శాతం తగ్గాయని పేర్కొనారు.

డీజిల్ వాహనాలు, గ్రామీణ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, కార్ల విక్రయాల్లో 10 శాతం వృద్ధి సాధించామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. క్రెటా, ఇలీట్ ఐ20, గ్రాండ్ మోడళ్లు మంచి అమ్మకాలు సాధించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు.

మహీంద్రా అండ్ మహీంద్రా  దేశీయ అమ్మకాలు 14% పెరిగాయి. ఇదే జోరును కొనసాగించగలమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్)ప్రవీణ్ షా చెప్పారు. ఢిల్లీలో డీజిల్ వాహనాల నిషేధంపై ఈ నెల 9న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు.. దేశ పారిశ్రామిక వృద్ధిలో  వాహన పరిశ్రమ పాత్రను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

మెట్రో నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా రెనో క్విడ్ కారుకు అద్భుతమైన స్పందన లభిస్తోందని రెనో ఇండియా సీఈఓ, ఎండీ సుమీత్ సాహ్ని పేర్కొన్నారు.

వినియోగదారుల అభిరుచులకనుగుణమైన వాహనాలను అందిస్తున్నామని, అందుకే పరిశ్రమ కన్నా మంచి విక్రయాలు సాధించామని ఫోర్డ్ ఇండియా ఈడీ అనురాగ్ మెహరోత్ర చెప్పారు.

ఇక టూవీలర్ సెగ్మెంట్ విషయానికొస్తే, హీరో మోటోకార్ప్ అమ్మకాలు 27 శాతం,   హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా విక్రయాలు 27 శాతం, యమహా అమ్మకాలు 66 శాతం, టీవీఎస్ మోటార్ అమ్మకాలు 16 శాతం చొప్పున పెరగ్గా, బజాజ్ ఆటో విక్రయాలు మాత్రం 2 శాతం తగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement