బిగ్బజార్ చేతికి ‘హెరిటేజ్ ఫ్రెష్’!
• అమ్మకానికి హెరిటేజ్ రిటైల్ వ్యాపారం
• ఫ్యూచర్ గ్రూప్‌తో చర్చలు నిజమేనన్న కంపెనీ
• ఈ వార్తలతో పరుగులు తీసిన షేరు ధర
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూపు నష్టాల్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని వదిలించుకోవడానికి సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, తుది రూపునకు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ఎక్స్ఛేంజీలకు పూర్తి వివరాలను తెలియచేస్తామని కంపెనీ ఆ లేఖలో పేర్కొంది.
ఈ వాటాల విక్రయంపై ఒక ఆంగ్ల బిజినెస్ పత్రికలో వచ్చిన కథనంపై ఎక్స్చేంజీ వివరణ కోరింది. ఈ వార్తల నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు సోమవారం ఒకానొక దశలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను రూ.956ను తాకి చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 10 శాతం లాభంతో రూ.898 వద్ద ముగిసింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ.362లుగా ఉన్న షేరు ధర ఏడాదిలో సుమారు రెట్టింపై రూ. 956 వరకు పెరిగింది.
నష్టాలకు తోడు...
డెయిరీ, రిటైల్, ఆగ్రి, బేకరీ, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూపు గత మార్చి నాటికి రూ. 2,387 కోట్ల టర్నోవర్‌పై రూ. 55 కోట్ల లాభాలను నమోదు చేసింది. కానీ మొత్తం వ్యాపారంలో సుమారు 20 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. గత మార్చి నాటికి రిటైల్ విభాగం రూ. 583 కోట్ల ఆదాయంపై రూ. 14 కోట్ల నష్టాన్ని (పన్నుకు ముందు) ప్రకటించింది. హెరిటేజ్ ఫ్రెష్ బ్రాండ్ నేమ్‌తో దేశవ్యాప్తంగా 115 స్టోర్స్ ఉన్నాయి. నష్టాలకు తోడు సుమారు 70కిపైగా రిటైల్ ఔట్‌లెట్లు తెలంగాణాలోనే ఉండటం కూడా రిటైల్ వ్యాపారం నుంచి వైదొలగడానికి కారణం కావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిటైల్ నుంచి వైదొలిగి ప్రధానమైన డెయిరీ వ్యాపారంపై మరింత దృష్టిసారించాలని కంపెనీ యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్‌లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ‘మోర్’రిటైల్ ఔట్‌లెట్లను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చినా వాస్తవ రూపందాల్చలేదు. ఇప్పుడు దక్షిణాది మార్కెట్లో బాగా విస్తరించి ఉన్న హెరిటేజ్ ఫ్రెష్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు దాదాపు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో మార్జిన్లు అధికంగా ఉండే సొంత లేబుల్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చన్నది ఫ్యూచర్ గ్రూపు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఊహాగానాలపై ఫ్యూచర్ గ్రూపు స్పందించలేదు. హెరిటేజ్ రిటైల్ వ్యాపారం విలువ ఎంత కట్టారు, ఈ ఒప్పందం ఏ విధంగా జరగనుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం షేర్ల బదలాయింపు విధానంలో కాకుండా నేరుగా నగదు రూపంలోనే జరగొచ్చని తెలుస్తోంది.
అంకెల్లో...
⇔ ప్రస్తుత హెరిటేజ్ గ్రూపు మార్కెట్ క్యాప్ రూ. 2,092 కోట్లు
⇔ మార్చి నాటికి హెరిటేజ్ గ్రూపు ఆదాయం రూ.2,387 కోట్లు
⇔ రిటైల్ బిజినెస్ ఆదాయం రూ. 583 కోట్లు
⇔ మార్చినాటికి కంపెనీకి ఉన్న అప్పులు రూ. 106 కోట్లు
⇔ రిటైల్ బిజినెస్ స్థూల నష్టం: 14 కోట్లు
⇔ ప్రస్తుత రిటైల్ ఔట్‌లెట్ల సంఖ్య 115
⇔ నెలకు 20 లక్షల మంది ఖాతాదారులు
⇔ రిటైల్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 2,689
⇔ ఏడాదిలో రెట్టింపై రూ.363 నుంచి రూ.956కి చేరిన షేరు