న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్ మార్కెటింగ్, పంపిణీ దిగ్గజం గెయిల్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికల్లా రెండు కంపెనీలుగా విభజించాలని కేంద్రం యోచిస్తోంది. గ్యాస్ మార్కెటింగ్ విభాగాన్ని ఒక కంపెనీగాను, పైప్‌లైన్ల నిర్వహణ విభాగాన్ని మరో సంస్థగాను ఏర్పాటు చేయనుంది.
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) చైర్మన్ డీకే సరాఫ్ ఈ విషయం తెలిపారు. విభజన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సరాఫ్ పేర్కొన్నారు. గెయిల్ ఇప్పటికే గ్యాస్ పైప్‌లైన్, మార్కెటింగ్ వ్యాపార విభాగాలకు సంబంధించిన ఖాతాలు వేర్వేరుగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ సులభతరంగానే ఉండగలదని ఆయన తెలిపారు. 1984లో ఓఎన్‌జీసీ నుంచి గ్యాస్ వ్యాపార కార్యకలాపాలను విడగొట్టి గెయిల్ ఏర్పాటు చేశారు.
గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకే: మరిన్ని ద్రవీకృత సహజ వాయువు టెర్మినల్స్ నిర్మించేందుకు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అవసరమయ్యే భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. అలాగే గ్యాస్ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి గెయిల్ కార్యకలాపాల విభజన తోడ్పడగలదని భావిస్తోంది.
ప్రస్తుతం చాలా మటుకు విద్యుత్ ప్లాంట్లు, సెరామిక్.. గ్లాస్ తదితర చిన్న పరిశ్రమలు ఖరీదైన, కాలుష్యకారకమైన నాఫ్తా, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, భవిష్యత్‌లో వీటిని గ్యాస్ వైపు మళ్లించేందుకు, గెయిల్‌తో సంబంధం లేకుండా నేరుగా గ్యాస్‌ను కొనుగోలు చేసుకునేందుకు తాజా విభజన తోడ్పడగలదని కేంద్రం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment