ఆడుతూ..పాడుతూ..
ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచే గేమ్స్
పొదుపు చేసే విధానం, పెట్టుబడులు పెట్టే తీరు కాలంతో పాటు మారిపోయాయి. కానీ ఇప్పటికీ చాలా మందికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి అంతగా తెలియదు. నిజానికి ఆర్థిక విషయాలపై ఎంత పట్టు ఉంటే, అందిపుచ్చుకోగలిగే అవకాశాలపైనా అంత అవగాహన ఉంటుంది. కానీ, వీటి గురించి తెలుసుకునే దగ్గరే వస్తుంది చిక్కంతా. డబ్బు మాట బాగానే ఉన్నప్పటికీ..దానితో ముడిపడి ఉండే విషయాలు కాస్త సంక్లిష్టంగా కనిపించడం వల్ల బోరింగ్‌గా అనిపిస్తుంటాయి. దీంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ అమలు చేయాలని ఉన్నా సరైన సమాచారం, అవగాహన లేక ఆ వైపుగా దృష్టి పెట్టడానికి బద్ధకించడం జరుగుతుంటుంది. ఇలా బోర్ కొట్టించకుండా ఆడుతూ, పాడుతూ ఆర్థిక విషయాలను నేర్పించే గేమ్స్ ప్రస్తుతం చాలా మటుకు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్‌ను బేస్ చేసుకుని ఆడే గేమ్ ఒకటైతే.. ఫుట్‌బాల్ ఆధారంగా ఆర్థిక మెలకువలు నేర్పేది మరొకటి. ఈ తరహా ఫైనాన్స్ గేమ్స్‌లో కొన్ని మీకోసం..
ది గ్రేట్ పిగ్గీ బ్యాంక్ అడ్వెంచర్
ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాధాన్యం గురించి నేర్పే గేమ్. మొబైల్ ఫోన్లలోనూ లభించే ఈ ఉచిత ఆన్‌లైన్ మినీ-గేమ్‌ను వాల్ట్ డిస్నీ ఇమాజినీరింగ్‌తో కలిసి టి రోవీ ప్రైస్ సంస్థ రూపొందించింది. ప్రధానంగా అమెరికాలో ఇన్వెస్టర్ల కోసమే దీన్ని తయారుచేసినప్పటికీ.. ఏ దేశం వారికైనా అనువుగా ఉండేలా ఇందులో పలు అంశాలను పొందుపర్చింది. ఒకవైపు ఆడుతూనే మరోవైపు నేర్చుకునేలా ఈ గేమ్ ఉంటుంది. లక్ష్యాలు పెట్టుకోవడం, పొదుపు చేయడం, జాగ్రత్తగా వ్యయాలు చేయడం, ద్రవ్యోల్బణం, అసెట్ కేటాయింపులు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ తదితర అంశాలను ఇది నేర్పుతుంది.
ప్రాక్టికల్ మనీ స్కిల్స్
పిల్లలు మనీ గురించి తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్లో బోలెడన్ని గేమ్స్‌తో పాటు ఉపయోగకరమైన సమాచారం కూడా ఉంటుంది.
ఫ్రాడ్ సీన్ ఇన్వెస్టిగేటర్
మిస్టరీలను ఛేదించడం ఇష్టపడేవారి కోసం ఈ గేమ్ రూపొందించడం జరిగింది. ఇందులో ఆర్థిక మోసాలను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ ఆర్థిక అంశాల గురించి కూడా ప్లేయర్ నేర్చుకోవచ్చు.
ఫండ్‌టేస్టిక్ కప్
క్రికెట్ స్ఫూర్తితో రూపొందించిన ఈ గేమ్.. క్విజ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్న ఒక్కో బాల్‌లాంటిది. ఈ గేమ్‌లో ప్రతి ఓవర్లో 10 బాల్స్ ..అంటే ప్రశ్నలు ఉంటాయి. వీటికి సరిగ్గా జవాబులు చెప్పగలిగితే తదుపరి రౌండుకు వెళ్లొచ్చు.
గేమ్ ఫర్ మనీ
జపాక్‌డాట్‌కామ్ వెబ్‌సైట్‌లో ఈ గేమ్ ఉంటుంది. భారతీయ ఇన్వెస్టర్లను దృష్టి లో పెట్టుకుని దీన్ని తయారు చేశారు. ఇందులో ప్లేయర్‌కి వర్చువల్ నగదు లభిస్తుంది. దాన్ని మ్యూచువల్ ఫండ్స్, బీమా, రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి వివిధ పెట్టుబడి సాధనాలకు కేటాయించాలి. పాచికలు వేస్తూ లక్ష్యం దిశగా గళ్లను దాటుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు, ప్లేయర్ ఆగిన గడిలో స్టాక్‌మార్కెట్ పెరిగిందనో, పడిందనో వస్తే దానికి తగ్గట్లే పోర్ట్‌ఫోలియో కూడా మారుతుంది.
మైండ్ బ్లోన్ లైఫ్
మనీ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలకు పదును పెడుతుంది ఈ మొబైల్ గేమ్. ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంచుతుంది.
ఫైనాన్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఆర్థిక అంశాల నిర్వహణలో పలు కోణాలను ఈ వెబ్‌సైట్ ఆవిష్కరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్, మొబైల్ గేమ్స్ ఇందులో చాలా ఉన్నాయి.