జీఎంపై పోరుకు సై అన్న డీలర్లు
న్యూడిల్లీ: అమెరికన్ ఆటోమేకర్ జనరల్ మోటార్స్‌పై దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు పోరాటానికి దిగనున్నారు. ఏడాది చివరినాటికి భారతదేశంలో తమ వాహన విక్రయాలను నిలిపివేస్తున్నామన్న ప్రకటనతో జనరల్‌మోటార్స్ డీలర్లు ఆందోళన పడిపోయారు. కంపెనీ నిర్ణయానికి నిరసనగా మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న140 షోరూంలను నిర్వహిస్తున్న 96మంది డీలర్లు ఈ ధర్నాకు దిగనున్నారు. తమ మొత్తం పెట్టుబడులలో సుమారు 12 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించడంతో అసంతృప్తిగా ఉన్న డీలర్లు నిరసనకు దిగుతున్నారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఆటో మొబైల్ డీలర్లు తమ నిరసనను తెలపనున్నారు. దేశీయ మార్కెట్‌నుంచి అకస్మాత్తుగా వైదొలగడం తమను తీరని నష్టాల్లోకి నెట్టివేయడంతో ఈ నిర్ణయం తప్పలేదని భారతీయ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అధ్యక్షుడు జాన్ పాల్ కుట్టుకరణ్ చెప్పారు. దాదాపు 15 వేల ఉద్యోగాలను కోల్పోతున్నామని, సంబంధిత మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు డీలర్లు, ఇతర ఉద్యోగులుఈ ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు.
మరోవైపు జనరల్ మోటార్స్ రూపొందించిన షరతు ప్రకారం జులై 15లోపు కంపెనీ ప్రతిపాదనను ఆమోదించని డీలర్‌కు పరిహారం మొత్తంలో 50శాత మాత్రమే లభిస్తుంది. అలాగే 15 సెప్టెంబర్ నాటికి ఈ ప్రతిపాదనను ఆమోదించకపోతే, డీలర్‌కు ఎలాంటి నష్టపరిహారం లభించదు.
కాగా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన 10మోడళ్ల ద్వారా తయారీ కార్యకలాపాలను విస్తరించనున్నామని, తదుపరి ఐదు సంవత్సరాలలో పెంచడానికి భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని 2015 ప్రకటించింది. అయితే దేశీయంగా డిమాండ్ క్షీణించడంతో స్తానిక విక్రయాలను నిలిపివేస్తున్నట్టు ఇటీవల (మే 18న) జనరల్ మోటార్స్ ప్రకటించింది. అలాగే ఇండియాలో కార్ల ఉత్పత్తిని మాత్రం నిలిపివేయడంలేదని స్పస్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని హలోల్ వద్ద మొదటి ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేసింది. మహారాష్ట్రలోని ప్లాంట్‌నుంచి వాహనాల ఎగుమతిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా షెవర్లే , బీట్ సెడాన్ కార్లను లాటిన్ అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాజాగా ప్రారంభించింది కూడా.
,