జనరల్ మోటార్స్(జీఎం) కంపెనీ బీట్, సెయిల్ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్(జీఎం) కంపెనీ బీట్, సెయిల్ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ ఇంగ్లిష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్‌తో ఒప్పందాన్ని పురస్కరించుకొని షెవర్లే బీట్, సెయిల్ మోడళ్లలో ఈ మాంచెస్టర్ యునెటైడ్ లిమిటెడ్ ఎడిషన్లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. మాంచెస్టర్ యునెటైడ్ ఫుట్‌బాల్ టీమ్ జెర్సీలపై షెవర్లే బ్రాండ్ ఆగమనం సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించింది.
ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ఫుట్‌బాల్ ప్రియులను అలరించగలవన్న ఆశాభావాన్ని జీఎం ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా వ్యక్తం చేశారు. బీట్, సెయిల్ మోడళ్లకు సంబందించి ఎల్‌ఎస్ వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందించే ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు, ప్రస్తుతమున్న ఈ మోడల్ కార్ల ధర కంటే రూ.69,000 అధికమని వివరించారు. ప్రస్తుతం బీట్ ఎల్‌ఎస్ వేరియంట్‌లో పెట్రోల్ కారు రూ.4.22 లక్షలకు, డీజిల్ కారు రూ.5.05 లక్షలకు, సెయిల్ ఎల్‌ఎస్ వేరియంట్‌లో పెట్రోల్ కారు రూ. 4.72 లక్షలకు, డీజిల్ కారు రూ.5.86 లక్షలకు(అన్నీ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) విక్రయిస్తోంది.