ఘజియాబాద్ బాలుడికి యాపిల్ స్కాలర్ షిప్
ఘజియాబాద్ : మొబైల్ ఫోన్ దిగ్గజాల్లో ఒకటైన యాపిల్ ఇంక్ స్పాన్పర్ చేసే ఓ స్కాలర్ షిప్ కాంపిటీషన్ లో ఘజియాబాద్ లోని 17 ఏళ్ల బాలుడు విజయం సాధించాడు. యాపిల్ వాచ్, ఐఫోన్ల కోసం రూపొందించిన స్లీపిసీ యాప్ కు గాను ఆ బాలుడికి డబ్ల్యూడబ్ల్యూడీసీ స్కాలర్ షిప్-2016 వరించింది. ఘజియాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన అన్షుక్ మిట్టల్, ఈ యాప్ డెవలప్ చేయడం 4000 డాలర్లను సంపాదించాడు. ఐఓఎస్ యూజర్ల కోసం యాప్ స్టోర్ లో 12.99 డాలర్లకు గాను ఈ యాప్ ను యాపిల్ అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకూ 3వేలకు పైగా డౌన్ లోడ్లు జరిగాయని కంపెనీ వెల్లడించింది.
యాపిల్ ఇంక్ ఆర్గనైజ్ చేసే డబ్ల్యూడబ్ల్యూడీసీ స్కాలర్ షిప్ కు 2015లో అన్షుక్ దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది వేసవి సెలవులు మొత్తం స్లీపిస్లీ యాప్ ను డెవలప్ చేయడానికే ఈ బాలుడు సమయం కేటాయించాడు. యాపిల్ నిర్దేశించిన ప్రొగ్రామ్ గైడ్ లైన్ల ప్రకారం ఈ యాప్ ను డెవలప్ చేశాడు. నిద్రను ట్రాక్ చేస్తూ.. నిద్ర పెరుగుదల సామర్థ్యాన్ని పెంచడం ఈ యాప్ ఉద్దేశ్యం. ప్రస్తుతం మనం నిద్రిస్తున్న నిద్రా విధానాన్ని మార్చడమే లక్ష్యంగా ఈ యాప్ ను అన్షుక్ రూపొందించాడు.
హార్ట్ రేటును పర్యవేక్షిస్తూ, వైబ్రేషన్ల ద్వారా నిద్రలోకి జారుకునే విధంగా ఈ యాప్ ఉపయోగపడుతోంది. దీని ద్వారా యూజర్ల నిద్రా సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. ఇది యాపిల్ వాచ్ లకు, ఐఫోన్ యాపిల్ లకు సపోర్టు చేస్తోంది. నిద్రపోయే పోకడలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేసిన అనంతరం ఈ యాప్ ను రూపొందించినట్టు అన్షుక్ తెలిపాడు. ఈ పరిశోధనలో 80శాతం అమెరికన్లు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తేలిందని చెప్పాడు. ఈ ఆలోచనే ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి సహకరించిందని అన్షుక్ పేర్కొన్నాడు.
మే మొదటివారంలో విన్నర్లను యాపిల్ ఇంక్ ప్రకటించింది. వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తుల్లో కొంతమందినే యాపిల్ ఇంక్ ఈ స్కాలర్ షిప్ కు సెలక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా గెలుపొందిన 350 మంది అభ్యర్థుల్లో తాను ఉండటం గర్వకారణంగా ఉందని, చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్షుక్ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యాపిల్ డెవలపర్ల కాన్షరెన్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి అన్షుక్ కు టిక్కెట్లను కూడా యాపిల్ అందించింది.
ఈ ఏడాదే బోర్డు ఎగ్జామ్స్ రాసిన అన్షుక్ , 93శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. లండన్ లోని జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్సులో అడ్మిషన్ ను కూడా అన్షుక్ పొందాడు. అన్షుక్ సాధించిన ఈ విజయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అన్షుక్ స్కూల్ లో చాలా తెలివిగల విద్యార్థని చెప్పారు.