మాల్యాకు అవకాశమివ్వాలి: మజుందార్ షా
హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై మీడియాయే విచారణ జరపటం వల్ల ప్రయోజనం లేదని బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. రుణ డిఫాల్ట్ సమస్యను బ్యాంకులతో సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా స్వయంగా చెప్పినందున, ఆయనకు సముచిత అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
‘బకాయిలు తక్షణం రాబట్టేయాలంటూ రుణాలిచ్చిన బ్యాంకులను, ఇతర రుణ దాతలను, ప్రభుత్వాన్ని... ఇలా ప్రతి ఒక్కరినీ ఇవాళ మీడియానే విచారణ చేసేస్తోంది. ఇది సరికాదు. ఈ మీడియా హడావుడి వల్ల అసలు ప్రక్రియ కుంటుపడుతోంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మాల్యా కచ్చితంగా భారత్ తిరిగి వస్తారని మజుందార్ షా ధీమా వ్యక్తం చేశారు. సరైన దివాలా చట్టం లేకపోవడం వల్లే రుణ, ఆర్థిక వివాదాల పరిష్కారానికి చాలా సమయం పట్టేస్తోందన్నారు.