గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ పైకి
6 స్థానాలు మెరుగుపరచుకొని 60కి చేరిక
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)–2017లో భారత్ 6 స్థానాలు మెరుగుపరచుకుంది. 130 దేశాలు కలిగిన ఈ జాబితాలో 60వ స్థానానికి ఎగబాకింది. దీంతో మధ్య, దక్షిణాసియా ప్రాంతంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించింది. తద్వారా ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇక జాబితాలో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా 22వ స్థానంలో ఉంది.
కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ జాబితాను రూపొం దించాయి. ఇక శ్రీలంక 90వ స్థానంలో, నేపాల్ 109వ స్థానంలో, పాకిస్తాన్ 113వ స్థానంలో, బంగ్లాదేశ్ 114వ స్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్ వరుసగా ఏడవసారి జాబితాలో అగ్ర స్థానంలో ఉంది.