GII
-
‘ఇన్నోవేషన్’లో భారత్‌కు 52వ ర్యాంకు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) –2019లో భారత్ ఐదు స్థానాలు మెరుగుపరచుకుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో మొత్తం 129 దేశాలు ఉండగా.. భారత్ 52వ స్థానాన్ని సొంతంచేసుకుంది. మేధో సంపత్తి ఫైలింగ్ రేట్స్ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్యా వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్ నిర్ణయం జరుగుతుంది. ఇక ప్రపంచంలోని టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు స్థానం సంపాదించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ సమాచారాన్ని బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ తొలుత 25వ స్థానానికి ఆ తరువాత 10వ స్థానానికి చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో భారత్ టాప్‌లో ఉన్నట్లు తెలిపారు. కార్మిక ఉత్పాదకత పెరుగుదల, సాంకేతిక ఉత్పాదన వృద్ధి, మేధో సంపత్తి సంబంధిత అంశాల మెరుగుదలతో పాటు సంస్థలు, మానవ మూలధనం, పరిశోధన పెరిగిన నేపథ్యంలో దేశ ర్యాంక్ మెరుగుపడింది. -
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ పైకి
6 స్థానాలు మెరుగుపరచుకొని 60కి చేరిక న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)–2017లో భారత్ 6 స్థానాలు మెరుగుపరచుకుంది. 130 దేశాలు కలిగిన ఈ జాబితాలో 60వ స్థానానికి ఎగబాకింది. దీంతో మధ్య, దక్షిణాసియా ప్రాంతంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించింది. తద్వారా ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇక జాబితాలో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా 22వ స్థానంలో ఉంది. కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ జాబితాను రూపొం దించాయి. ఇక శ్రీలంక 90వ స్థానంలో, నేపాల్ 109వ స్థానంలో, పాకిస్తాన్ 113వ స్థానంలో, బంగ్లాదేశ్ 114వ స్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్ వరుసగా ఏడవసారి జాబితాలో అగ్ర స్థానంలో ఉంది.