బ్రెగ్జిట్ విలయం ఖరీదు ఎంతో తెలుసా? | Global markets lose 2.1 trillion dollars in Brexit rout | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్ విలయం ఖరీదు ఎంతో తెలుసా?

Published Sat, Jun 25 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

బ్రెగ్జిట్ విలయం ఖరీదు ఎంతో తెలుసా?

బ్రెగ్జిట్ విలయం ఖరీదు ఎంతో తెలుసా?

బ్రెగ్జిట్ బ్లాస్ట్ ప్రపంచ మార్కెట్లలో సృష్టించిన సునామీ విలువ ఎంతో తెలిస్తే మనం నోరు వెళ్లబెట్టాల్సిందే.. కోట్లాది మంది మదుపరుల ఆశలు ఆవిరైపోయాయి. దాదాపు 1.35 కోట్ల కోట్లు (2.1 ట్రిలియన్ డాలర్లు)  అలా గాలిలో కలిసిపోయాయని నివేదికలు చెబుతున్నాయి.  యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సిందేనన్న బ్రిటన్ ప్రజల తీర్పు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు అశనిపాతంలా మారింది.  తీవ్రమైన అమ్మకాల ఒత్తిడితో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు  అతకలాకుతలమయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు విలవిల్లాడిపోయారు. దాదాపు అన్ని రంగాలకు చెందిన కోటానుకోట్ల రూపాయల సంపద క్షణాల్లో గల్లంతైంది. అలాగే బ్రెగ్జిట్‌ కారణంగా భారత స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్‌ ఫ్రైడే నమోదైంది. మార్కెట్‌ పతనం నేపథ్యంలో ఒకానొక దశలో మదుపర్ల సంపద రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరవ్వగా.. ముగింపులో ఈ మొత్తం 1.78 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.

ఎస్ అండ్ పీ డౌజోన్స్ అంచనా ప్రకారం దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. దీన్ని రూపాయల్లోకి మారిస్తే సుమారు 1.35 కోట్ల కోట్లు అవుతుంది. ప్రపంచ ఆర్థికమాంద్యం నాటి చీకిటిరోజుల్లో  కూడా ఇంత భారీ నష్టాలు చూడలేదని నోమురా సెక్యూరిటీస్ కు చెందిన జార్జ్  విశ్లేషించారు. టోక్యో, పారిస్ మార్కెట్లు 8 శాతం, ఫ్రాంక్ ఫర్ట్ సుమారు ఏడు శాతం, లండన్, న్యూయార్క్ మార్కెట్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.  ఈ బ్రెగ్జిట్ సెగ ట్రావెల్ ఇండస్ట్రీని బాగానే తాకింది. హోటల్, ట్రావెల్స్ ఏజెన్సీ, విమానయాన షేర్లు భారీగా పతనమయ్యాయి.

ఇప్పటికే  పౌండ్ 10 శాతం నష్టంతో 31 సంవత్సరాల కనిష్ఠానికి  పడిపోయింది. అటు భారీ పతనంతో జపాన్‌ మార్కెట్‌ లో ఒక దశలో 10 నిమిషాల పాటు ట్రేడింగ్‌ నిలిపివేయాల్సి వచ్చింది. డాలర్ నష్టాల్లో  కూడా మినహాయింపు లేదు. ఒక సమయంలో డాలర్ విలువ నవంబర్ 2013 తర్వాత మొట్టమొదటి సారి 100 యెన్ల కిందికి  కిందికి పడిపోయింది. బ్రెగ్జిట్ పరిణామాల తర్వాత బాగా లాభపడినవాటిలో వెండి బంగారాలతో పాటు జపనీస్ కరెన్సీ యెన్ కూడా ఉంది. ఐరోపా మార్కెట్లదీ ఇదే ధోరణి. ఎఫ్‌ఎటీఎస్‌ఈ (లండన్‌) 4శాతం, డాక్స్‌ (జర్మనీ) 6శాతం, సీఏసీ 40 (ఫ్రాన్స్‌) 8శాతం మేర నష్టాన్ని చవిచూశాయి. ఈ పరిణామాల  నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరింత నెమ్మదిస్తుందని అర్థం చేసుకోవాలని అమెరికన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రధాన ఆర్థికవేత్త జేమ్స్  చెస్సన్  చెప్పారు.

లండన్ బెంచ్ మార్క్ ఎఫ్టీఎస్సీ100 ఇండెక్స్  ప్రారంభంలో 7.5 శాతం మేర క్షీణించింది. అయితే  బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ ప్రకటనతో తరువాత పాక్షికంగా కోలుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ద్రవ్యమద్దతు ఇస్తామని హామీ ఇవ్వడం కూడా దీనికి తోడ్పడింది. పారిశ్రామిక సగటు 610 పాయింట్లు కోల్పోయిందని, 2011 తర్వాత ఇదే  అతిపెద్ద నష్టమని విశ్లేషకుడు కానర్ కాంప్ బెల్  చెప్పారు.

బ్రిటన్‌ నిష్క్రమణతో భారత ఐటీ, ఆటో, గార్మెంట్‌, ఫార్మా ఇండస్ట్రీలు తీవ్రంగా నష్టపోయే అవకాశముందనీ, ఈయూ రెండో అతిపెద్ద మార్కెట్‌ కావడంతో బ్రెగ్జిట్‌ తదనంతర పరిణామాలు ఇండియన్‌ కంపెనీలపైనా పడే ఛాన్సుందని నిపుణులు అంటున్నారు. ఒక దశలో సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయినా ఆ తర్వాత కాస్త కోలుకుని నష్టాన్ని 600 పాయింట్లకు పరిమితం చేసుకుంది. బ్రిటన్‌ నిష్క్రమణ ముఖ్యంగా ఐటీ రంగంపై ఎక్కువ ప్రభావం చూపింది. పౌండ్‌ విలువ భారీగా పతనం కావడంతో ఐటీ ఇండెక్స్‌ 4శాతానికి పైగా నష్టపోయింది. డాలర్‌ తో రూపాయి మారకం విలువ కూడా రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినా ఆ తర్వాత కోలుకుంది. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.

అయితే బ్రెగ్జిట్‌ ఎఫెక్ట్‌ తో బులియన్ మార్కెట్ వైపు మదుపరులు మళ్లిపోయారు. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో రెండువేలకు పైగా పెరిగింది.  దీంతో బంగారం పది గ్రాముల ధర రూ. 31,500 దాటగా,  వెండి కిలో రూ. 42,500కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement