న్యూఢిల్లీ: ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారత్ 8,230 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా 62,584 బిలియన్ డాలర్లతో అత్యంత సంపన్న దేశంగా మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు ఏఎఫ్‌ఆర్ ఆసియా బ్యాంకు ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ నివేదిక విడుదలైంది. చైనా 24,803 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జపాన్ 19,522 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆయా దేశాల్లోని అందరు వ్యక్తుల ఉమ్మడి సంపద విలువ ప్రకారం వేసిన అంచనాలు ఇవి.
వ్యక్తుల సంపద అంటే ఆస్తులు, నగదు, షేర్లు, వ్యాపార ప్రయోజనాలు అన్నీ కలిసినవి (అప్పులు మినహాయించగా). భారత్‌లో సంపద సృష్టికి తోడ్పడిన అంశాల్లో భారీ సంఖ్యలో వ్యాపారవేత్తలు, మంచి విద్యా విధానం, ఐటీ, బీపీవో, రియల్‌ఎస్టేట్, హెల్త్‌కేర్, మీడియా రంగాలు బలంగా ఉండటమేనని నివేదిక తెలిపింది. వీటి కారణంగా పదేళ్లలో సంపద 200 శాతం వరకు పెరగడానికి తోడ్పడినట్టు పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు (వ్యక్తుల) సంపద 215 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. ఇది 2027 నాటికి 321 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రపంచంలో 2,252 మంది బిలియనీర్లు (100 కోట్ల డాలర్లకంటే ఎక్కువ ఉన్నవారు) ఉన్నారని, 5,84,000 మల్టీ మిలియనీర్లు (కోటి డాలర్ల కంటే ఎక్కువ) ఉన్నారని, అదే సమయంలో 1.52 కోట్ల ధనవంతులు ఉన్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment