భారీగా పెరిగిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2017 మార్చి త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికర నష్టం క్రితంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.2,479 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.395 కోట్ల నుంచి రూ.272 కోట్లకు పడిపోయింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రెండింతలకుపైగా పెరిగి రూ.3,684 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.1,256 కోట్ల నుంచి రూ.1,182 కోట్లుగా ఉంది.
కాగా, ఆర్థిక సంవత్సరంలో రూ.37,480 కోట్లున్న స్థూల రుణ భారం రూ.19,856 కోట్లకు తగ్గించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 13.71% ఎగసి రూ.17 వద్ద క్లోజ య్యింది. ఎయిర్‌పోర్ట్ విభాగం లాభాలు పెరిగా యని, తొలిసారిగా ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులు డివిడెండు ప్రకటించినట్టు కంపెనీ వెల్లడించింది. జీఎంఆర్ వరోరా ఎనర్జీ మొదటిసారిగా లాభాలను ఆర్జించి రూ.143 కోట్లను నమోదు చేసింది.
కాకినాడ, కృష్ణగిరిల్లో మిగులు భూముల విక్రయం
రుణభారాన్ని మరింత తగ్గించుకునే క్రమంలో తమకు రోడ్లు, విద్యుత్ రంగాల్లో వున్న కొన్ని ఆస్తుల్ని విక్రయిస్తామని జీఎంఆర్ గ్రూప్ సీఎఫ్‌ఓ మధు తెర్దాల్ చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ, కృష్ణగిరిల్లో వున్న మిగులు భూముల్ని విక్రయించడంపై దృష్టిపెట్టామని, ఈ విక్రయం ద్వారా రూ. 1000–1200 కోట్లు సమకూరుతాయని అంచనావేస్తున్నామన్నారు. ఇటీవలే ఇండోనేషియాలో బొగ్గు గనిని అమ్మడం ద్వారా రూ. 400 కోట్ల నగదు లభించిందని, రోడ్డు ప్రాజెక్టుల్ని విక్రయించడం ద్వారా మరో రూ. 500–600 కోట్లు పొందవచ్చని భావిస్తున్నామని ఆయన వివరించారు. జీఎంఆర్ ఎనర్జీ ద్వారా ఐపీఓ జారీచేసే ప్రణాళిక కూడా వుందని, ఈ అంశాలన్నీ తమ రుణభారం తగ్గడానికి దోహదపడతాయన్నారు.
హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై
రూ. 7,400 కోట్ల పెట్టుబడి...
తమ హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై తాజాగా రూ. 7,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మధు వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టును రూ. 4,500–5,000 కోట్ల పెట్టుబడితో విస్తరించాలని యోచిస్తున్నామని, ఈ ఎయిర్‌పోర్టు వద్ద రూ. 2,700 కోట్ల నగదు నిల్వలున్నాయన్నారు. అలాగే హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణను రూ. 2,400 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నామని, ఈ ఎయిర్‌పోర్టు రూ. 1,000 కోట్ల నగదు నిల్వను కలిగివున్నదన్నారు. తమ స్థూల ఆదాయం రూ. 8,236 కోట్లని, అందులో రూ. 2,989 కోట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి, రూ. 1,057 కోట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సమకూరిందన్నారు.