న్యూఢిల్లీ : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కంట్రోలింగ్ వాటా అమ్మక వార్తలపై జీఎమ్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఖండించింది. కంట్రోలింగ్ వాటాను అమ్మడం లేదని వెల్లడించింది. కానీ ఫండ్స్ ను సేకరించడానికి అవకాశాలను అన్వేషిస్తున్నామని జీఎమ్ఆర్ ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాటాను జీఎమ్ఆర్ అమ్మేస్తుందని, సంప్రదింపులు అడ్వాన్స్ డ్ దశలో ఉన్నాయని ఊహాగానాలు జోరందుకోవడంతో జీఎమ్ఆర్ ఇన్ ఫ్రా స్పందించింది. 'హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కంట్రోలింగ్ వాటాను అమ్మే విషయాన్ని మేము పూర్తిగా కొట్టివేస్తున్నాం.. అయితే జీఎమ్ఆర్ గ్రూపుకు అవసరమైన ఫండ్స్ కోసం మాత్రం అవకాశాలను అన్వేషిస్తున్నాం..' అని జీఎమ్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, బీఎస్ఈకి నివేదించింది.
2016 మార్చి 31 త్రైమాసిక ముగింపుకు కంపెనీ రూ.953.5 కోట్ల ఏకీకృత నికర నష్టాలను నమోదుచేసింది. అంతకముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టం రూ.891.9 కోట్లగా ఉంది. నిర్వహణ పరంగా వచ్చిన మొత్తం ఆదాయాలు 29.12శాతం పెరిగి, రూ.3,708.37గా నమోదయ్యాయి. గతేడాది ఈ ఆదాయాలు రూ.2,872.01 కోట్లగా ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాటాను అమ్మడం లేదని కంపెనీ బీఎస్ఈకి నివేదించిన తర్వాత ఉదయం ట్రేడింగ్ లో జీఎమ్ఆర్ ఇన్ ఫ్రా షేర్లు 1.49శాతం పెరిగాయి.