కాకినాడ సెజ్‌లో తొలి వాణిజ్య కేంద్రం షురూ
టాటా-జీఎంఆర్ భాగస్వామ్యంలో రూరల్ బీపీఓ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ సెజ్‌లో తొలి కమర్షియల్ సెంటర్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలో జీఎంఆర్, దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఈ ఐటీ ఆధారిత సెంటర్‌లో ఆధార్‌కార్డుల తయారీ పనులు జరగనున్నాయి.
జీఎంఆర్ ప్రెసిడెంట్ ప్రసన్న చల్లా, టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీనివాస్ కొప్పోలు సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. రూరల్ బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్)లో కాకినాడ సెజ్ నిర్వాసిత కుటుంబాలకు చెందిన శిక్షణ ఇచ్చిన 20 మంది యువకులకు చల్లా, కొప్పోలు ఉద్యోగ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ మెట్రో, టైర్-2 నగరాల్లో బలీయంగా ఉన్న బీపీఓ పరిశ్రమను, ప్రతిభావంతమైన మానవ వనరులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలనేదే లక్ష్యమన్నారు.
టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ యువత నగర యువత కంటే ఎంత మాత్రం తక్కువ కాదనే విషయాన్ని నిరూపించిందన్నారు. కాకినాడ సెజ్‌లో మొదటి దశ పనులు ప్రారంభించామని, దీనిలో భాగంగా మెరైన్ ఫుడ్స్ ప్రాసెసింగ్, బొమ్మల పరిశ్రమలు వచ్చే మూడు, ఆరు నెలల్లో రానున్నాయని ప్రసన్న చెప్పారు.
ఏడాదిలో ఈ పరిశ్రమల ద్వారా రెండువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టీబీఎస్‌ఎస్‌ఎల్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ బీపీఓ వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్త్తుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి బీపీఓ కార్యకలాపాలు నిర్వహిస్త్తుందన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ పోతుకూచి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ డెరైక్టర్ మీరా రఘునాథన్, కాకినాడ సెజ్ ప్రాజెక్టు హెడ్ బీహెచ్‌ఏ రామరాజు తదితరులు పాల్గొన్నారు.