
ఉప్పాడ మేజర్ హార్బర్ నిర్మాణ స్థలం
పచ్చని చెట్లు ..తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీరం ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామికంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి.
పిఠాపురం: జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
జాతీయ రహదారి నిర్మాణం
కాకినాడ–తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన పారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది.
పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్
కాకినాడ సెజ్ సమస్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి.. ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు ఇప్పటికే అప్పగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా మన జిల్లాలో ఇది రెండో పోర్టు.
భూసేకరణకు ప్రణాళికలు
భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం.
– చిన్ని కృష్ణ, ఆర్డీఓ కాకినాడ
చదవండి:
ప్రేమను గెలిపించిన పిడకల సమరం
పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్
Comments
Please login to add a commentAdd a comment